తాటినీరాతో అధికాదాయం | Toddy palms will generate income | Sakshi
Sakshi News home page

తాటినీరాతో అధికాదాయం

Published Sun, Feb 26 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

తాటినీరాతో అధికాదాయం

తాటినీరాతో అధికాదాయం

- గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి నీరా దోహదం
- కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ చౌడప్ప


సాక్షి, హైదరాబాద్‌:
కొబ్బరి, తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి, విలువను జోడించి విక్రయించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, గీత కార్మికులు అధికాదాయాన్ని పొందే సువర్ణ అవకాశం ఉందని కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ (కాసర్‌గోడ్, కేరళ) డైరెక్టర్‌ పి. చౌడప్ప అన్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే కొబ్బరి, తాటి నీరాను ఎక్సైజ్‌ చట్టం పరిధి నుంచి తొలగించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయ శంకర్‌ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో తాటి నీరా, నీరాతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతి అవకాశాలు అంశంపై జరిగిన సదస్సులో చౌడప్ప మాట్లాడారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌కు 2 నెలల కిందట లేఖ రాయడం వల్లే ఈ రోజు తాటి నీరాపై సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

ఔషధగుణాలు గల పానీయాలు: స్వామిగౌడ్‌
తాటి నీరా, కల్లు ఔషధ గుణాలు గల పానీయాలని శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ అన్నారు. తాటి నీరా, తాటి బెల్లం ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి విదేశాలకూ ఎగుమతి చేయొచ్చన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గిరాకీ కలిగిన నీరా వంటి తాటి ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే రాష్ట్రంలోని 2,30,000 మంది గీత కార్మికులు ఆర్థికా భి వృద్ధి సాధించవచ్చన్నారు. లీటరు నీరా రూ. 150, తాటి బెల్లం కిలో రూ. 200కు అమ్ముకోవచ్చని చెప్పారు. తాటి నీరా కేన్సర్‌ రాకుండా, వయాగ్రా అవసరం లేకుండా చేస్తుందన్నారు.

తాటి బెల్లం చాక్లెట్లకు మంచి గిరాకీ: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
తాటి నీరాతో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ పరిశ్రమను తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడిలో ప్రారంభించబోతున్నామని వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త  పి.సి.వెంగయ్య తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాటి నీరా, తాటి బెల్లంతో తయారైన చాక్లెట్లు, మిఠాయిలకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. తాటి కల్లు, నీరాలను ఎక్సైజ్‌ చట్టం పరిధి నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కె.బి. హెబ్బర్, పీజేటీఎస్‌ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, కొండాలక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్‌ విజయ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement