MP Vishweshwar reddy
-
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బాలికల ఆరోగ్య రక్షణ కిట్టు పథకంలో భాగంగా అజీజ్‌నగర్‌లో శనివారం వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా ఆయన ఇతర మండలానికి వెళ్లడంతో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్ ఆరోగ్య రక్షణ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బాలికలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నాదే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ప్రవేశపెడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాధ్యం కాని పథకాలను సైతం పవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కొనియాడారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితాశ్రీహరియాదవ్, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ నాగయ్య, ఈఓపీఆర్డీ ఉషారాణి, ఎంపీటీసీ కొత్తమానిక్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోహన్‌గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మంగలి మంగరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, అధికారులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
సాక్షి, వికారాబాద్: పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత మేరకు కృషిచేస్తున్నానని అన్నారు. తాత్కాళిక పనులతో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినవని చెప్పారు. వీటితో రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీరు, సాగునీటికి కొరత ఉండదని పునరుద్ఘాటించారు. యువతకు ఉపాధి కల్పించడానికి గాను వారి స్వగ్రామాలలోనే ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను సోయా పాలు పంపిణీ చేయాలని కూడా యోచిస్తున్నామని తెలిపారు. జిల్లాలో స్వతహాగా పర్యాటకం అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాత్రివేళ బస చేసేందుకు ఇక్కడ సౌకర్యాలు లేవని, పర్యాటకుల కోసం సుమారుగా 500 గదులను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 85 మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు, నిర్వహణకు గాను ప్రయోగాత్మకంగా వాహనాలను ఏర్పాటుచేశామని తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకుగాను అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. నోరు తెరిచిన బోర్‌వెల్స్‌ను గుర్తించి క్యాపింగ్ చేసేందుకుగాను ప్రత్యేక యాప్‌ను తయారుచేశామని వివరించారు. ఆ యాప్‌లో బోరు ఫొటో అప్‌లోడ్‌చేస్తే దానంతట అదే లొకేషన్ చూపిస్తుందని, తద్వారా క్యాపింగ్ సులభమవుతుందని తెలిపారు. సమావేశంలో ధారూరు పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కె.రాందేవ్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. నాగసమందర్ గ్రామం సందర్శన ధారూరు: మండలంలోని నాగసమందర్ గ్రామాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వివేకానంద విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామానికి ప్రజలతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, యువతకు ఉపాధిపై మాట్లాడారు. ఎంపీ వెంట ధారూరు పీఏసీఎస్ చైర్మెన్ హన్మంత్‌రెడ్డి, గ్రామ సర్పంచు శ్రీనివాస్, ఎబ్బనూర్ సర్పంచు రాజేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ యువజన విబాగం ఉపాధ్యక్షుడు వడ్లనందు, నాయకులు రవీందర్‌రెడ్డి, వరద మల్లికార్జున్‌లు ఉన్నారు. -
తాటినీరాతో అధికాదాయం
- గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి నీరా దోహదం - కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్ చౌడప్ప సాక్షి, హైదరాబాద్: కొబ్బరి, తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి, విలువను జోడించి విక్రయించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, గీత కార్మికులు అధికాదాయాన్ని పొందే సువర్ణ అవకాశం ఉందని కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ (కాసర్గోడ్, కేరళ) డైరెక్టర్ పి. చౌడప్ప అన్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే కొబ్బరి, తాటి నీరాను ఎక్సైజ్ చట్టం పరిధి నుంచి తొలగించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయ శంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో తాటి నీరా, నీరాతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతి అవకాశాలు అంశంపై జరిగిన సదస్సులో చౌడప్ప మాట్లాడారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌కు 2 నెలల కిందట లేఖ రాయడం వల్లే ఈ రోజు తాటి నీరాపై సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఔషధగుణాలు గల పానీయాలు: స్వామిగౌడ్ తాటి నీరా, కల్లు ఔషధ గుణాలు గల పానీయాలని శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ అన్నారు. తాటి నీరా, తాటి బెల్లం ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి విదేశాలకూ ఎగుమతి చేయొచ్చన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ కలిగిన నీరా వంటి తాటి ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే రాష్ట్రంలోని 2,30,000 మంది గీత కార్మికులు ఆర్థికా భి వృద్ధి సాధించవచ్చన్నారు. లీటరు నీరా రూ. 150, తాటి బెల్లం కిలో రూ. 200కు అమ్ముకోవచ్చని చెప్పారు. తాటి నీరా కేన్సర్ రాకుండా, వయాగ్రా అవసరం లేకుండా చేస్తుందన్నారు. తాటి బెల్లం చాక్లెట్లకు మంచి గిరాకీ: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తాటి నీరాతో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ పరిశ్రమను తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడిలో ప్రారంభించబోతున్నామని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్య తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాటి నీరా, తాటి బెల్లంతో తయారైన చాక్లెట్లు, మిఠాయిలకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. తాటి కల్లు, నీరాలను ఎక్సైజ్ చట్టం పరిధి నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కె.బి. హెబ్బర్, పీజేటీఎస్ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ విజయ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వ ప్రయత్నం...
చిన్నారి గిరిజ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అభంశుభం తెలియని ఆ చిట్టితల్లి ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నా.. రెస్య్కూ ఆపరేషన్ ఆలస్యమవుతున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. మంచాల సమీపంలో ఆదివారం ఉదయం గిరిజ అనే చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలిక కోసం బంధువులు రెండు రోజులుగా అన్నపానీయాలు మాని ఘటనా స్థలంలోనే గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాం గం చిన్నారిని వెలికి తీసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. సింగరేణి నుంచి వచ్చిన టీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తవ్వకాల్లో పెద్ద బండరాళ్లు బయల్పడుతుండడంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. కలెక్టర్ శ్రీధర్ రెండు రోజులుగా ఘటనా స్థలంలోనే ఉండి పనులను సమీక్షిస్తున్నారు. బాలిక కోసం కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్ * బోరుబావిలోనే చిన్నారి గిరిజ.. * ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు * పర్యవేక్షించిన కలెక్టర్, ఎమ్మెల్యే * వివరాలు సేకరించిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజను బోరుబావిలోంచి వెలికితీసేందుకు యంత్రాంగం సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం ఉద యం 10:30 గంటల సమయంలో మంచాలకు చెందిన చిన్నారి గిరిజ(4) పొలం వద్ద తన అన్న చరణ్‌తో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచిఉన్న బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్న యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆదివా రం రాత్రి జేసీబీ, హిటాచీలతో బోరుబావికి సమాంతరంగా గుంతలు తవ్వినా ఫలితం లేకుండా పోయింది. సహాయక చర్యలకు ఆటంకం... బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుపుతున్న భూమి గట్టిగా ఉండడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మొదటగా చిన్నారి దాదాపు 35 అడుగుల లోతులో ఉందని గమనించిన అధికారులు ఆదిశగా తవ్వకాలను ప్రారంభించారు. 40 అడుగులు దాటిన తర్వాత రాయి రావడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. యంత్రాంగం రాయిని డ్రిల్‌చేసి ముందకు కొనసాగారు. అధికారుల దృఢ సంకల్పం.. చిన్నారి గిరిజను ఎలాగైనా కాపాడాలనే కృతనిశ్చయంతో యంత్రాంగం ముందుకు సాగుతోంది. చిన్నారి శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది నిరంతరం గొట్టాల ద్వారా ఆక్సీజన్ అందిస్తూనే ఉంది. బంధువుల జాగారం.. బోరుబావిలో పడిపోయిన తమ చిన్నారి ఎలాగైనా ప్రాణాలతో బయటపడుతుందని బంధువులు, కుటుంబీకులు కొండంత నమ్మకంతో ఉన్నారు. ఆదివారం ఉదయం ఘటన జరిగినప్పటి నుంచి వారు అక్కడే ఉన్నారు. నిద్ర, తిండీతిప్పలు లేకుండా బోరుబావి వద్దే జాగారం చేస్తున్నారు. బాలిక అమ్మమ్మ ఐల మ్మ, తండ్రి ఐలయ్యలు రోదిస్తూనే ఉన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు సహాయక చర్యలను పరిశీలించారు. మంచాల గ్రామానికి చెందిన కోట్ల సుధీర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి భోజనవసతి ఏర్పాటు చేసి ఔదార్యం చాటుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఎన్డీ ఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగింది. అదే రాత్రి మైన్స్ రెస్క్యూ టీం కూడా వచ్చింది. సోమవారం సాయంత్రం 4:20 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్, మైన్స్ రెస్క్యూ టీంలు బోరుబావికి అడ్డంగా ప్లేటు వేయాడానికి తవ్వకాలు ప్రారంభించారు. పలు ఆటంకాలు ఎదురైనా అధికారులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. సోమవారం రాత్రి లైటింగ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లిపోయిన కలెక్టర్ శ్రీధర్ తిరిగి సోమవారం ఉదయం 11:45 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. జేసీ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వచ్చారు. పనులు వేగవంతం చేయాలని ఆయన యంత్రాగాన్ని కోరారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తుండగా ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడుతుండ గా పక్కన ఉన్న వాళ్లు ఆయనను పట్టుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంజర్ల శేఖర్‌రెడ్డి సాయంత్రం బోరుబావి వద్దకు వచ్చారు. వేలాదిమంది ప్రజలు ఘటనా స్థలంలో చిన్నారి రాకకోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు సేకరించిన ఎంపీ ఆదివారం రాత్రి 10 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి గిరిజ కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. బాలికను సురక్షితంగా వెలికితీసే వరకు యంత్రాంగం, నాయకులు కృషిచేస్తారని ఆయన భరోసా కల్పించారు. క్షణక్షణం ఉత్కంఠ.. ఆదిబట్ల: చిన్నారి ఆచూకీ కోసం క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా జనం పోగయ్యారు. జనం కిక్కిరిసిపోవడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచాల మండలంలో ఎవరిని కదిలించినా చిన్నారి బోరుబావిలో పడిన విషయమే మాట్లాడుతున్నారు.