అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం | All areas development is our aim : mp vishweshwar reddy | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం

Published Fri, Jan 12 2018 12:20 PM | Last Updated on Fri, Jan 12 2018 12:20 PM

All areas development is our aim : mp vishweshwar reddy - Sakshi

సాక్షి, వికారాబాద్‌: పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత మేరకు కృషిచేస్తున్నానని అన్నారు. తాత్కాళిక పనులతో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినవని చెప్పారు. వీటితో రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీరు, సాగునీటికి కొరత ఉండదని పునరుద్ఘాటించారు.

యువతకు ఉపాధి కల్పించడానికి గాను వారి స్వగ్రామాలలోనే ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు. పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను సోయా పాలు పంపిణీ చేయాలని కూడా యోచిస్తున్నామని తెలిపారు. జిల్లాలో స్వతహాగా పర్యాటకం అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉన్నదని చెప్పారు. అనంతగిరి, కోట్‌పల్లి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాత్రివేళ బస చేసేందుకు ఇక్కడ సౌకర్యాలు లేవని, పర్యాటకుల కోసం సుమారుగా 500 గదులను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 85 మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.

 రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు, నిర్వహణకు గాను ప్రయోగాత్మకంగా వాహనాలను ఏర్పాటుచేశామని తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకుగాను అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. నోరు తెరిచిన బోర్‌వెల్స్‌ను గుర్తించి క్యాపింగ్‌ చేసేందుకుగాను ప్రత్యేక యాప్‌ను తయారుచేశామని వివరించారు. ఆ యాప్‌లో బోరు ఫొటో అప్‌లోడ్‌చేస్తే దానంతట అదే లొకేషన్‌ చూపిస్తుందని, తద్వారా క్యాపింగ్‌ సులభమవుతుందని తెలిపారు. సమావేశంలో ధారూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కె.రాందేవ్‌రెడ్డి, రాములు తదితరులు  పాల్గొన్నారు.

నాగసమందర్‌ గ్రామం సందర్శన
ధారూరు: మండలంలోని నాగసమందర్‌ గ్రామాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం సందర్శించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వివేకానంద విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామానికి ప్రజలతో సమావేశమై మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, యువతకు ఉపాధిపై మాట్లాడారు. ఎంపీ వెంట ధారూరు పీఏసీఎస్‌ చైర్మెన్‌ హన్మంత్‌రెడ్డి, గ్రామ సర్పంచు శ్రీనివాస్, ఎబ్బనూర్‌ సర్పంచు రాజేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్‌ యువజన విబాగం ఉపాధ్యక్షుడు వడ్లనందు, నాయకులు రవీందర్‌రెడ్డి, వరద మల్లికార్జున్‌లు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement