పర్యాటకాభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు
పర్యాటకాభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు
Published Sun, Oct 9 2016 10:53 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
రాష్ట్ర పర్యాటకా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాంత్
వైనతేయ తీర ప్రాంతాల పరిశీలన
అమలాపురం టౌన్ / ఉప్పలగుప్తం : జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల ద్వారా పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి శ్రీకాంత్ అల్లవరం మండలం వైనతేయ నదీ తీర గ్రామాలైన బోడసకుర్రు, గోడితిప్ప, ఎస్.యానాం తీరంలోని బోట్ షికారుకు అనువుగా ఉన్న పర్ర ప్రాంతం, రిసార్ట్స్‌లకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. జిల్లాలో పర్యాటకానికి అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్న కార్యక్రమంలో భాగంగా రాజప్ప శ్రీకాంత్‌ను వైనతేయ నదీ పరివాహాక ప్రాంతాలను చూపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో హోప్ ఐలెండ్, ఏజెన్సీ, అఖండ గోదావరి, కోనసీమ ఈ నాలుగు విభాగాల్లో నాలుగు పర్యాటక ప్రాజెక్టులను రూపొందిస్తున్నామన్నారు. కేరళలో పర్యాటకాభివృద్ధికి ధీటుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు అనేకం ఉన్నాయన్నారు. మడ అడవులు, సముద్ర తీరం, అఖండ గోదావరి, హోప్ ఐలెండ్ తదితర అందాలపై దృష్టి పెడితే పర్యాటకాభివృద్ధేకాక, ఆదాయం పెరుగుతుందన్నారు. టెంపుల్ టూరిజానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రైవేట్ రంగం ద్వారా జిల్లాలో రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసే యోచన ఉందన్నారు. 7 స్టార్, 5 స్టార్ స్థాయి రిసార్ట్స్‌ను నెలకొల్పేందుకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్ యానాంలోని రవ్వ చమురు క్షేత్రంలోని కెయిర్న్ ఎల్‌క్యూలో కెయిర్న్ అధికారులతో బీచ్ అభివృద్ధి్ద విషయమై చర్చించారు.
రూ.300 కోట్లతో పర్యాటక అభివృద్ధి: హోంమంత్రి చిన రాజప్ప
జిల్లాలో రూ.300 కోట్లతో పర్యాటక అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. ఇప్పటికే రూ.70 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. కాకినాడ నుంచి అంతర్వేది వరకూ ఉన్న బీచ్‌లను కూడా అభివృద్ధి చేయనున్నామని రాజప్ప తెలిపారు. కేరళ నుంచి వచ్చిన టూరిజం కన్సల్టెంట్ సిడిరక్, అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి భీమశంకరం, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, అల్లవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గునిశెట్టి చినబాబు, ఎంపీపీ గుబ్బల మాతా కస్తూరి పాల్గొన్నారు.
Advertisement