బీచ్‌రోడ్డు మెరిసేలా.. పర్యాటకం మురిసేలా..  | Integrated Museum Will Be Set Up At Visakha Beach Rs 40 Crore | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్డు మెరిసేలా.. పర్యాటకం మురిసేలా.. 

Published Sun, Dec 15 2019 7:59 AM | Last Updated on Sun, Dec 15 2019 7:59 AM

Integrated Museum Will Be Set Up At Visakha Beach Rs 40 Crore - Sakshi

సబ్‌మెరైన్‌ మ్యూజియం ముఖద్వారం నమూనా

సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ నగర సిగలో మరో పర్యాటక మణిహారం చేరనుంది. నగరాన్ని పర్యాటకంలో అగ్రపథాన నిలపాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులకు ఆకట్టుకునే విధంగా నూతన ప్రాజెక్టులను వీఎంఆర్‌డీఏ రూపకల్పన చేసింది. బీచ్‌ రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రూ.40 కోట్లతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు, డీపీఆర్‌ సిద్ధం చేశారు. రూ.10 కోట్లతో సీహారియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యూజియం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించనున్నారు.     

ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం... 
సీ హారియర్‌ మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. బీచ్‌ రోడ్డుకు వచ్చే ప్రతి సందర్శకుడికీ సరికొత్త అనుభూతి కలిగించేలా మ్యూజియం తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన నేపథ్యంలో వీఎంఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ని అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం బీచ్‌రోడ్డులో అందుబాటులోకి రానుంది. 

ఫుడ్‌ కోర్టులు.. షాపింగ్‌లు... 
ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంలో భాగంగా రాజీవ్‌ స్మృతి భవన్‌లో సీ హారియర్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. రూ.10 కోట్లతో మ్యూజియం అభివృద్ధి చెయ్యనున్నారు. అదే విధంగా రూ.10 కోట్లతో సబ్‌మెరైన్‌ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్‌ కోర్టులు, షాపింగ్‌ చేసుకునేలా  దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వీఎంఆర్‌డీఏ సిద్ధమవుతోంది. సీహారియర్‌ మ్యూజియంలో.. వివిధ రకాల యుద్ధ విమానాల గురించి తెలుసుకునేలా సమగ్ర సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టీయూ–142 మ్యూజియం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌ మాదిరిగా సబ్‌మెరైన్‌ మ్యూజియంను తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా.. ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంలో విభిన్న హంగులు కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. సావనీర్‌ షాప్, సిమ్యులేషన్‌ గేమ్స్, కాఫీషాప్‌తో పాటు జోన్‌ల వారీగా విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీయూ–142, సబ్‌మెరైన్, సీ హారియర్‌ విమానాలకు గుర్తులుగా కీచైన్లు, పుస్తకాలు, ట్రేలు, కాఫీ కప్పులు, జ్ఞాపికలు.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులతో కూడిన షాపింగ్‌ దుకాణాలు కొలువుదీరనున్నాయి. 

సిద్ధమవుతున్న సీహారియర్‌... 
ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్‌ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్‌ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ సీహారియర్‌ నౌకాదళం ఏవియేషన్‌ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి ని్రష్కమించింది. ఈ యుద్ధ విమానాన్ని వీఎంఆర్‌డీఏ  సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్‌ స్మృతి భవన్‌లో దీనికి సంబంధించిన మ్యూజియం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీన్ని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సముద్రపు గాలులకు ఇది తుప్పు పట్టకుండా ఇటీవలే వీఎంఆర్‌డీఏ ప్రత్యేక కోటింగ్‌ వేయించింది. త్వరలోనే ఇది రాజీవ్‌ స్మృతి భవన్‌కు చేరనుంది.

బీచ్‌ను కొత్తగా చూస్తారు... 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇది అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. మ్యూజియంని సందర్శించడంతో పాటు జ్ఞాపకాల్ని తీసుకెళ్లేలా షాపింగ్‌ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. 
–పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement