కేజీ రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహానగరంగా రూపుదిద్దుకున్న విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఓ వైపు కడలికెరటాల సవ్వడులు... మరోవైపు పచ్చదనం పరచుకున్న ప్రకృతి అందాలు... పెట్టని ఆభరణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇటు విస్తరిస్తున్న ఐటీ రంగం... అటు విద్యాసుగంధాలు వెదజల్లుతున్న సరస్వతీ నిలయాలు నగరానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి.
నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లై ఓవర్లు... మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాలు విశేష గౌరవాన్ని ఆపాదిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు... ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన జంక్షన్లు నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖ ఉక్కుకర్మాగారం... ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు... నగర సమీపంలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు విశాఖకు విశేష గుర్తింపునివ్వగా... గతేడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులతో నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రగతి పథంలో నడుస్తూ కార్యనిర్వాహక రాజధానికి కావలసిన అర్హతలన్నీ పుణికిపుచ్చుకుంది.
నాలుగేళ్లుగా అభివృద్ధిలో పురోగమిస్తున్న నగరం
విస్తరిస్తున్న ఐటీ రంగం
► రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను బీచ్ ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వాటికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చింది. ఫలితంగా ప్రధాన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన డెవలప్‌మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేసింది. దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంతో పాటు కంపెనీకి వెళ్లేందుకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేశారు.
► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమెజాన్ తదితర ఐటీ, వాటి అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్ లో హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందితో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2006లో విప్రో క్యాంపస్‌కు 750 మందితో ప్రారంభించేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో దశలవారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
► వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ని మార్చాలని నిర్ణయించింది. విశాఖలో స్టార్టప్‌ల ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) సీఈవో సంజీవ్ మల్హోత్రా ప్రకటించారు.
► ఐటీ రంగంలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ఇక్కడే ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సహకారంతో పాటు సంయుక్త సర్టిఫికేషన్ కోర్సుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
► అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్.. విశాఖలో కొత్త బ్రాంచ్‌ని ప్రారంభించింది. భారత్‌లో ఢిల్లీ తర్వాత వైజాగ్‌లోనే చెగ్ సంస్థ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడం. విశేషం.
అంతర్జాతీయ సదస్సులకు వేదికగా...
ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన అంతర్జాతీయ ఐటీ సదస్సు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సన్నాహక సదస్సులు సూపర్ సక్సెస్ అయ్యాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇన్ ఇండియా(ఎన్‌ఎఫ్‌ఐసీఐ) 28వ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంతో పాటు 12వ సర్వ సభ్య సమావేశాలు, జైళ్ల శాఖ ఎనిమిదో జాతీయ సదస్సు, అగ్రిసదస్సు, ఇలా ప్రతి ఒక్కరికీ విశాఖ ఆహ్వానం పలుకుతోంది.
డేటా సెంటర్లు.. స్టార్‌హోటల్స్‌కు కేరాఫ్
ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖపట్నంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించేలా సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దారు. అందుకే.. ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా శంకుస్థాపన చేశారు.
► వైజాగ్ టెక్‌పార్క్ కూడా 39,815 మందికి ఉపాధి కల్పించేలా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీని రూ.21,844 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చింది.
► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. ఇలా.. విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు.
సరికొత్తగా నగర రహదారులు
గుంతల మయంగా ఉన్న రహదారులు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్తగా రూపు దిద్దుకున్నాయి.
నాలుగేళ్లలో మంజూరైన రహదార్లు: 2089
వెచ్చించనున్న నగదు: రూ.547.45 కోట్లు
ఇప్పటివరకూ పూర్తయిన రోడ్లు: 1,216
వీటికి అయిన ఖర్చు: రూ. 202.59 కోట్లు
పురోగతిలో ఉన్న రహదారులు: 873
వీటికి చేస్తున్న ఖర్చు: రూ.344.86 కోట్లు
కొత్తగా వేస్తున్న రహదారుల పొడవు: 27 కి.మీ.
వీటికి వెచ్చిస్తున్న మొత్తం: రూ.104 కోట్లు
కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్‌బేలు: 20
వీటికి చేసిన ఖర్చు: రూ.462.70 లక్షలు
ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్‌తో చెక్
అత్యంత రద్దీ కూడలిగా ఉన్న ఎన్‌ఏడీలో ఫ్లైఓవర్ నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ 2016 నుంచి ప్రయత్నిస్తున్నా అప్పటి టీడీపీ ప్రభుత్వం సరైన సహకారం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూతూ మంత్రంగా 2018 చివర్లో పనులు ప్రారంభించారు. కానీ.. ఎన్నికల ముందు నాటికే బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు భుజానికెత్తుకొని రూ.150 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఎన్‌ఏడీ జంక్షన్.. నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. దీనివల్ల పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు తెరపడింది.
పర్యాటకం...మరింత ఆకర్షణీయం..
► గతంలో విశాఖ పేరు వింటేనే ఆర్‌కే బీచ్, రిషికొండ, భీమిలి బీచ్ ప్రాంతాలు గుర్తుకువచ్చేవి. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం 11 కొత్త బీచ్‌లను అభివృద్ధి చేసింది.
► రూ.12.55 కోట్లతో మొత్తం 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఏరివేస్తూ శుభ్రం చేస్తున్నారు.
► ఈ 11 బీచ్‌లను అనుసంధానిస్తూ.. కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్‌లో జిల్లాలోని 25 బీచ్‌లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమిలిలోని పాండవుల పంచ బీచ్, అన్నవరం, భీమిలి, నేరెళ్లవలస, ఎర్రమట్టిదిబ్బలు, ఐఎన్‌ఎస్ కళింగ, మంగమారిపేట, తొట్లకొండ, తిమ్మాపురం, ఎస్‌ఈజెడ్, రుషికొండ, ఇస్కాన్ టెంపుల్, సాగర్‌నగర్, జూపార్క్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్క్, ఆర్‌కేబీచ్, రాధాకృష్ణ బీచ్, రాక్‌బీచ్, దుర్గా బీచ్, యారాడ, ప్యారడైజ్, అప్పికొండ, అప్పికొండ–2, అప్పికొండ బ్రిడ్జ్ బీచ్‌లు కొత్తగా పర్యాటకుల్ని స్వాగతం పలకనున్నాయి.
ఆరోగ్యప్రదాయినిగా కేజీహెచ్
► గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆధునికీకరంచింది.
► ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన క్యాజువాలిటీయే ఇప్పటికీ కొనసాగుతుండగా రెండో క్యాజువాలిటీ నిర్మాణానికి కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున రూ.30 లక్షలు కేటాయించి చేసి 15 పడకలతో నిర్మించారు.
► సెకెండ్ క్యాజువాలిటీని రౌండ్‌ది క్లాక్ పనిచేసేగా తీర్చిదిద్దారు. రోగుల కోసం రూ.15 లక్షలతో లేబొరేటరీతో పాటు మొబైల్ ఎక్స్‌రే యూనిట్, అల్ట్రా
స్కానింగ్ సిద్దం చేశారు. ఆధునిక సౌకర్యాలు,సెంట్రల్ ఎయిర్ కండిషన్, పడకలు, ఆక్సిజన్, ఇతర సదుపాయాలు కల్పించారు.
► కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షల సీఎస్సార్ నిధులతో పునర్నిర్మించారు. ఐసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, పెయింటింగ్స్, మరుగుదొడ్లు కొత్తగా తీర్చిదిద్దారు.
► విద్యుత్ ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేజీహెచ్‌లో 120 కేవీ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
► ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరమైన పరికరం దశాబ్దం నుంచి పనిచేయకపోవడంతో శస్త్ర చిక్సితలు నిలిచిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని టెంపరేచర్
కంట్రోల్ మెషిన్‌ని మంజూరు చేసింది.
► అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పి బారిన పడేవారికోసం రాష్ట్ర ప్రభుత్వం స్టెమి ప«థకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో దీనిని అమలు చేస్తున్నారు. కార్డియాలజీ వైద్యుల సూచన మేరకు సుమారు రూ.30 వేల విలువైన ఇంజక్షన్ కేజీహెచ్‌లో ఉచితంగా రోగులకు అందిస్తున్నారు.
రెండింతల అభివృద్ధి...!
2014–19 వరకూ టీడీపీ చేసిన ఖర్చు: రూ.1450 కోట్లు
టీడీపీ ఐదేళ్ల హయాంలో చేపట్టిన పనులు: 4450
2019–2023 వరకూ వైఎస్సార్‌సీపీ చేసిన ఖర్చు: రూ.2490 కోట్లు
వైఎస్సార్‌సీపీ హయాంలో నాలుగేళ్ల కాలంలో చేపట్టిన పనులు: 9920
గడపగడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు: 708 దీనికోసం వెచ్చిస్తున్న నగదు: రూ. 66 కోట్లు
జంక్షన్లు... జిగేల్ !
► మహావిశాఖ పరిధిలోని జంక్షన్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారులు కలిసే జంక్షన్లను విశాలంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా కూడళ్ల వద్ద అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేశారు.
► రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద రైల్వే కోచ్‌తో కూడిన జంక్షన్ నగరవాసులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక బస్టాండ్లను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment