
పట్టువీడని విక్రమార్కుడు, వైఎస్సార్‌సీపీ అధినేత, తొమ్మిదేళ్ల పాటు ఎవరెన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా వెనుదిరగకుండా అలుపెరుగని పోరాటం చేసిన జగన్‌మోహన్ రెడ్డి విజయం సాధించారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరూ చేయనన్ని రోజులు పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమై, వారి కష్టాలు విని ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, హీరోలు పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ గెలుపుపై వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
నికార్సైన వ్యక్తిని ఎంచుకున్నారు
జగన్‌పై ప్రజలపై ఉన్న అభిమానం ఈ రోజు ఆయనకు అంతటి ఘన విజయాన్ని కట్టబెట్టింది. జగన్ విజయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు నిజమైన పాలనను, నిఖర్‌సైన వ్యక్తిని ఎంచుకున్నారనే విషయం ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు వారు కోరుకున్న పరిపాలనను అందించాలని జగన్‌ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.– దగ్గుబాటి సురేష్ బాబు, ప్రొడ్యూసర్.
ఇది ప్రజా విజయం
ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. అందరి దృష్టి ఏపీపైకి మళ్లించాయి. నిజం చెప్పాలంటే ఇంత భారీ మెజార్టీతో గెలిచిన వైఎస్సార్‌సీపీది ప్రజా విజయం. ప్రజలే ఆయనను గెలిపించుకున్నారు. ఏ హామీలనైతే నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారో..ఆ హామీలను ఈ ఐదేళ్లల్లో అమలు చేయాలని ఆశిస్తున్నా.
– ఆదిపినిశెట్టి, హీరో
అనూహ్య విజయం
అందరం ఉహించినట్లుగానే వైఎస్సార్‌సీపీ విజయాన్ని సాధించింది. అయితే ఇంత భారీ మెజార్టీ వస్తుందని అనుకోలేదు. ఎన్నికల మేనిఫెస్టొలో ఇచ్చిన నవరత్నాలను పక్కాగా అమలు చేస్తానంటూ చెప్పడం ఆనందంగా ఉంది. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో గెలిచానని చెప్పడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఇంత ఘన విజయాన్ని సాధించిన ఆయన బతికున్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఈ విషయంలో ఏ మాత్రం డౌట్ లేదు.
– తమ్మారెడ్డి భరద్వాజా, నిర్మాత
యంగ్ అండ్ డైనమిక్ సీఎం
తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఫైనల్లీ ఏపీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రిగా అయ్యారు. జగన్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఓపిక, నిరాడంబరత, నిబద్దత, గౌరవం, పోరాడే శక్తి, తెలివితేటలు ఈరోజు ఆయనను ఈ హోదాలో నిలబెట్టాయి. ఆయనని చూసి నేను గర్విస్తున్నా, నాకైతే ఎంతో ఆనందంగా ఉంది.
– ప్రిన్స్, హీరో
మిరాకిల్ విజయం
40 ఏళ్ల చరిత్రలో ఇలాంటి విజయాన్ని మొట్టమొదటి సారి చూస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. జగన్ కష్టం, అదృష్టం, శ్రమ, పట్టుదలతో పాటు చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత గెలిపించాయనే చెప్పాలి. ఓ మంచి పార్టీకి సపోర్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా మైనార్టీ ఓటర్లు 85శాతం మంది రాత్రి వరకు క్యూలో నిల్చుని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని జగన్ నాయకత్వాన్ని ఎంచుకున్నారు. ఒక మైనార్టీగా మైనార్టీలందరికీ జగన్ గెలుపు సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
– అలీ, హాస్యనటుడు
Comments
Please login to add a commentAdd a comment