సాక్షి, సిటీబ్యూరో : భానుడు భగ్గుమంటున్నాడు. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఏకబిగిన ఏనిమిది గంటలు ఎండలో డ్యూటీ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఈ నేపథ్యంలో ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిటీ ట్రాఫిక్ సిబ్బందికి ఇక ఉపశమనం లభించనుంది. ఈ పరిస్థితిని గమనించిన సిటీ ట్రాఫిక్ చీఫ్ (అడిషనల్ సీపీ) అనిల్‌కుమార్ సిబ్బందికి అత్యాధునికి ఉత్పత్తులు అందజేయాలని నిర్ణయించారు.
ప్రత్యేకంగా తయారు చేసిన 500 కూలింగ్ జాకెట్లను ఈ ఏడాది పంపిణీ చేయనున్నట్లు ఆయన బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.
ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్ సిబ్బంది ధరిస్తున్న స్లీవ్‌లెస్ మాదిరిగానే నీలి రంగులో ఈ జాకెట్లు ఉంటాయి. రెండు పొరలతో ఉండి మధ్యలో ప్రత్యేకమైన ఊల్ మెటీరియల్ వీటి ప్రత్యేకత.
పైభాగంలో ఉండే మొదటి పొర ఎండ వేడి లోపలకు వెళ్లకుండా పరిరక్షిస్తుంది. సిబ్బంది ఈ జాకెట్ ధరించే ముందు దాన్ని నీటిలో పూర్తిగా తడిపి, పిండకుండా ధరించాల్సి ఉంటుంది. దీని లోపల ఉండే ప్రత్యేక ఉలెన్ మెటీరియల్ తడిని తనలో ఇముడ్చుకుంటుంది. వెనుక వైపు ఉండే రెండో పొర చెమ్మ సిబ్బంది ధరించిన యూనిఫామ్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది.
అలాగే ట్రాఫిక్ పోలీసులు తలపై హెల్మెట్ తరహాలో ఉండే టోపీలు ధరిస్తారు. కొత్తగా ఖరీదు చేస్తున్న క్రౌన్‌గా పిలిచే గుండ్రటి ఉత్పత్తిని సైతం నీటిలో తడిపి టోపీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా రెండు పొరలతో, మధ్యలో ప్రత్యేక ఉలెన్‌తో తయారు చేసిందే. ఈ జాకెట్ ధరిస్తే బయటి దాని కంటే ఆరు నుంచి 12 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో శరీరం ఉంటుంది.
ఇవి ఒకసారి తడిపితే ఆయా ప్రదేశాల్లోని గాలిలో ఉన్న తేమ శాతాన్ని బట్టి కనిష్టంగా మూడు గంటల నుంచి గరిష్టంగా ఐదు గంటల వరకు వేడి నుంచి కాపాడతాయి. నగరానికి చెందిన ఓ స్పిన్నింగ్ మిల్ ఎంతో అధ్యయనం చేసి వీటిని తయారు చేసింది. వేసవి కాలంలో వేడి నుంచి, శీతాకాలంలో చలి నుంచి కాపాడటం ఈ జాకెట్ల ప్రత్యేకత. ఒక్కో జాకెట్ రూ.2,500 వరకు ఖరీదు చేస్తుంది.
గతేడాది ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) 200 జాకెట్లను ప్రయోగాత్మకంగా అందించింది. ఫలితాలు ఉండటంతో ఈ ఏడాది 500 ఖరీదు చేయాలని నిర్ణయించిన ట్రాఫిక్ విభాగం అధికారులు, అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వారాంతానికి కూలింగ్ జాకెట్లు సిబ్బందికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మరోపక్క సైబరాబాద్, రాచకొండ అధికారులు సైతం ఈ తరహా జాకెట్లను ఖరీదు చేసి సిబ్బందికి అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment