సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రిజిష్టరై అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ప్రైవేటు రవాణా వాహనాలన్నీ తాము చెల్లించాల్సిన పన్ను మొత్తానికి హామీ పత్రాలు సమర్పించాలంటూ గత వారం తామిచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం వరకు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పన్ను విధింపు ఉత్తర్వులు లోపుభూయిష్టంగా ఉన్నాయని, ఎప్పటి నుంచి పన్ను వసూలు చేస్తారు..? ఎంత మొత్తం మేర పన్ను చెల్లించాలి..? తదితర వివరాలను ఆ ఉత్తర్వుల్లో పొందుపరచలేదన్నారు. తరువాత తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, పన్నుల వివరాలను జీవోలో పేర్కొనకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రవాణా చట్టాన్ని తమ రాష్ట్రానికి అన్వయింప చేసుకున్నామని, అందువల్ల అందులో ఉన్న విధంగానే పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, గత వారం తాము జారీ చేసిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను శనివారం వరకు పొడిగిస్తున్నామని, శుక్రవారం పూర్తిస్థాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
రవాణా పన్నుపై హైకోర్టు ఉత్తర్వులు పొడిగింపు
Published Wed, Apr 8 2015 3:55 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
Advertisement
Advertisement