
ఆపద సమయంలో వైద్యమందించి ప్రాణం పోయాల్సిన వైద్యుడు అంతుచిక్కని వ్యాధి ఉందంటూ అసహ్యించుకున్నాడు. చికిత్స అందించలేమంటూ చీదరించుకున్నాడు. వైద్యుడి నిర్వాకంతో తల్లడిల్లిన నిండు గర్భిణి ఆస్పత్రి ఎదుట కన్నీరు మున్నీరైంది. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో తప్పనిసరైన పరిస్థితిలో ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి వైద్యులు, అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. ఇప్పటికే వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోసారి స్పష్టమైంది. నిండు గర్భిణి అ ని కూడా చూడకుండా అందులోనూ హెచ్‌ఐవీ ఉందనే కారణంగా ఆమె ముఖంపైనే ‘ఎందుకొచ్చావు వైద్యం చేయబోం..’ అంటూ వైద్యు డు బెదిరించిన సంఘటన శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. భైంసా మండలం కోల గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి ఉదయం 10గంటలకు రిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. జిల్లా ఆదర్శ హెచ్‌ఐవీ పాజిటివ్ పీపుల్ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత ఏఆర్టీ సెంటర్‌లో మందులు తీసుకున్న తర్వాత బయటకొచ్చింది. భైంసా నుంచి గర్భిణి రావడంపై మెటర్నిటీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధ్యక్షురాలు సరిత తెలిపారు.
భైంసాలో ఆస్పత్రి, వైద్యులు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారని, దీంతో తాము వెళ్లిపోయే క్రమంలో సదరు గర్భిణికి నొప్పులు రావడంతో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12గంటలకు అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి గర్భిణిని అడ్మిట్ చేసుకున్నప్పటికీ రౌండ్స్ కోసం సాయంత్రం 4గంటలకు వచ్చిన డాక్టర్ రామకృష్ణ మళ్లీ ఎందుకొచ్చావు.. ఉదయాన్నే నిన్ను పొమ్మన్నాను కదా అంటూ ఆమె పట్ల ఆగ్రహంగా మాట్లాడడంతో బాధితురాలు కంటతడి పెట్టింది. వెళ్లిపోవాలంటూ బెదిరించడంతో చేసేదేమీ లేక రిమ్స్ ఆస్పత్రి బయట కూర్చుంది. అధ్యక్షురాలు సరితకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పడంతో ఆమె అక్కడికి వచ్చింది. డాక్టర్ రామకృష్ణ తీరుపై రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు చెప్పినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. తనకెందుకు చెబుతున్నారు, సంబంధిత డిపార్ట్‌మెంట్ డాక్టర్ ఉన్నారు కదా ఆయనకు చెప్పుకొమ్మంటూ డైరెక్టర్ సమాధానం ఇవ్వడంపై అధ్యక్షురాలు ఆగ్రహం వ్య క్తం చేసింది. ఈ క్రమంలో డాక్టర్, డైరెక్టర్ స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. విషయం బయటకు పొక్కడంతో చేసేదేమీ లేక చివరకు గర్భిణిని అడ్మిట్ చేసుకున్నారు.
కనికరం లేదా..
పేదలకు దేవాలయం లాంటి ఆస్పత్రిని, వైద్యులను దేవుళ్లతో పోల్చుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అలాంటివారిని మానవత దృక్పథంతో, బాధ్యతాయుతంగా వైద్యం అందించాల్సిన వైద్యులు, ఉన్నత స్థానంలో ఉన్న రిమ్స్ డైరెక్టర్ సైతం స్పందించకపోవడం గమనార్హం. కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాప్రతినిధుల ముందు గొప్పలు చెప్పుకుంటున్న రిమ్స్ అధికారులు.. తీరా రిమ్స్‌కు వచ్చిన రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు గర్భిణికి వైద్యం నిరాకరించిన వైద్యుడికి అనుకూలంగా మాట్లాడాడని, తన స్థాయికి తగ్గట్లు వ్యహరించకపోవడం సరైంది కాదని హెచ్‌ఐవీ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత అన్నారు. గతంలో సైతం హెచ్‌ఐవీ రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్ ఆస్పత్రి మొత్తానికి అధికారిగా ఉన్న డైరెక్టర్ రోగులకు వైద్యం, వారి సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం తనకు ఎలాంటి సంబంధం లేదనే ధోరణిలో సమాధానం ఇవ్వడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని రోగులు కోరుతున్నారు.
కలెక్టర్ హెచ్చరించినా.. తీరు మారదా
ఇటీవల రిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కలెక్టర్ దివ్యదేవరాజన్ గత శనివారం రిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యసేవలపై నిర్లక్ష్యం చేయకూడదంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ప్రాక్టిస్‌తోపాటు రిమ్స్‌కు వచ్చే రోగుల పట్ల అలసత్వం వహించకుండా వారితో మంచిగా స్పందించాలని సూచించారు. వైద్యులతోపాటు సిబ్బంది సైతం రోగులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కలెక్టర్ గతంలోనే ఆదేశించారు. గత నెలలో జరిగిన రిమ్స్ అభివృద్ధి సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రిమ్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆ సమావేశంలోనే ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని వీడాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించా రు. అయినప్పటికీ రిమ్స్ వైద్యులు, అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనమే శనివారం జరిగిన సంఘటన.
Comments
Please login to add a commentAdd a comment