టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు తీరుపై...తుమ్మల సీరియస్
ఖమ్మం వైరా రోడ్: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో అలసత్వంగా వ్యవహరిస్తున్న నాయకులపై ఆ పార్టీ నేత, రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ ఏ ఒక్కరితో నడిచేది కాదని, అందరూ సమష్టిగా కృషి చేస్తేనే మనుగడ సాధ్యమవుతుందని శ్రేణులకు హితబోధ చేశారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గ సభ్యత్వ నమోదు బాధ్యులతో ఆయన ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘సభ్యత్వ నమోదులో కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి ఉంటే చేరుుంచండి. లేకపోతే సభ్యత్వ పుస్తకాలు తిరిగి ఇచ్చేయండి. మీ చేతగానితనంతో ప్రజలు నష్టపోతారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించేది లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పాల్గొనాలనే ఆలోచన, కోరిక, శక్తి ఉన్న వారికి మాత్రమే సభ్యత్వ పుస్తకాలు ఇవ్వాలని నాయకులను ఆదేశించారు. పదవులు రావాలంటే.. ముందుగా మన ధర్మాన్ని మనం పాటించాలని అన్నారు.
అనేక పార్టీల నుంచి వచ్చిన వారు టీఆర్‌ఎస్‌లో ఉన్నారని, అందరూ కలిసిమెలిసి పనిచేయూలని అన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారికి ఎన్నటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. కష్టపడి పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తామని, తద్వారా రాజకీయ పరమార్థం దక్కుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. సభ్యత్వం పూర్తిచేసిన పుస్తకాలను సోమవారం నాటికి ఇవ్వాలని బాధ్యులను ఆదేశించారు. సభ్యత్వ ఆన్‌లైన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తవుతుందన్నారు. నియోజకవర్గ ఇచ్‌చార్జ్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఎస్‌బి.బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, నాయకులు మదార్‌సాహెబ్, నల్లమల వెంకటేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు వెనుకబడ్డామో చెప్పాలి
కూసుమంచి: ‘‘రాజకీయ చైతన్యమున్న జిల్లాగా ఖమ్మానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానముంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల చూపు మన వైపే ఉంది. కానీ పార్టీ సభ్యత్వ నమోదులో మాత్రం మనం ఎందుకు వెనుకబడ్డామో మీరే చెప్పాలి’’ అని నాయకులు, కార్యకర్తలనుద్దేశించి టీఆర్‌ఎస్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం శనివారం పాలేరులోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగింది. ఖమ్మం రూరల్ మండలంలో సభ్యత్వ నమోదుపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ... ఖమ్మం రూరల్ మండలంలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయూలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలో పెను మార్పులు వస్తాయని, టీఆర్‌ఎస్ ప్రభంజనానికి అడ్డే ఉండదని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల దరికి చేరేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు దిండిగాల రాజేందర్, బేగ్, బత్తుల సోమయ్య, రావెళ్ళ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.