
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల వనరులు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో టీఆర్‌ఎస్ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. తొలుత నితిన్ గడ్కరీని కలసి సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల ప్రాజెక్టులపై చర్చించారు. ఆగస్టు 27న సీఎం కేసీఆర్.. గడ్కరీని కలసి పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలను టీఆర్‌ఎస్ ఎంపీలు గడ్కరీ వద్ద మరోసారి నివేదించారు. కృష్ణా నదీ జలాలను నది పరీవాహక రాష్ట్రాల మధ్య తిరిగి పంచాలని, ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపేలా కృష్ణా ట్రిబ్యునల్‌కు ప్రతిపాదించాలని కోరారు.
గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామసాగర్ ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగా గుర్తించాలని నివేదిం చారు. 154 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–గజ్వేల్– భువనగిరి– చౌటుప్పల్ రహదారి, 180 కి.మీ. పొడవున్న చౌటుప్పల్– యాచారం– షాద్‌నగర్– చేవెళ్ల– శంకర్‌పల్లి– కంది రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించడం ద్వారా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. జడ్చర్ల– మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్–167 పై 15 కి.మీ. మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. పలు జాతీయ రహదారులకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, పలు రహదారులకు అలైన్‌మెంట్ అనుమతి రావాల్సి ఉందని గుర్తుచేశారు.
హైకోర్టు విభజనపై చర్యలు తీసుకోండి
హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి త్వరితగతిన నోటిఫికేషన్ వెలువడేందుకు చొరవచూపాలని రవిశంకర్ ప్రసాద్‌ను కోరినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపారు. ఈ సమావేశాల్లో టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి గెలుపొందిన బాల్క సుమన్ తన ఎంపీ పదవికి చేసిన రాజీనామాను సోమవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment