సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీని బలహీనపరిచేందుకు, టీఆర్‌ఎస్‌ను బలోపేతం ‘గులాబీ’ దళ నేత తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కేంద్రీకరించారు. టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు తీసుకొచ్చేందుకు తుమ్మల వర్గీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ వైపు చూస్తున్న ముఖ్య నాయకులందరికీ తుమ్మల నాగేశ్వరరావు నేరుగా అందుబాటులో ఉండేలా ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, నగర పంచాయతీ చైర్‌పర్సన్ తదితరులు తుమ్మలతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అత్యంత సన్నిహితులైన గంగారం సొసైటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు తుమ్మలకు సంఘీభావంగా టీఆర్‌ఎస్‌లో చేరటం చర్చనీయాంశమైంది.
కలిసి పనిచేశాం.. కలిసే నడుద్దాం..
‘ఒకటి కాదు.. రెండు కాదు.. 30 ఏళ్లపాటు రాజకీయంగా కలిసి పనిచేశాం. తుమ్మలతోనే ఉన్నాం. ఆయననే నమ్ముకున్నాం. ఇప్పుడు కూడా ఆయనతోనే నడుదా. ఒక్కటిగా ఉం దాం’- టీడీపీ శ్రేణులను బయటకు రప్పించేం దుకు తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు జపిస్తున్న మంత్రమిది. టీడీపీలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కింది నుంచి పై వరకు మొత్తం శ్రేణులను ‘కారు’ ఎక్కించేం దుకు తుమ్మల వర్గీయులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చిన వెంటనే సత్తుపల్లి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు బిగించేలా ఆయన వర్గీయులు కసరత్తు సాగిస్తున్నారు.
ఈ దిశగా అందివస్తున్న ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సత్తుపల్లి నగర పంచాయతీలో మిగిలిన పదిమంది కౌన్సిలర్లలో అత్యధికులను తమవైపు తిప్పుకునేందుకు ‘ఏర్పాట్లు’ పూర్తిచేసినట్టు సమాచారం. సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి ఇంతకాలం అండగా నిలిచిన బలమైన సామాజికవర్గానికి చెందిన మెజార్టీ నాయకులు ఇప్పటికే ‘గులాబి’ గూటికి చేరారు. మిగిలిన కొద్దిమందిని కూడా రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.
వలసలను అడ్డుకునేందుకు సండ్ర ప్రతివ్యూహం
టీడీపీ వలసలను నిలువరించేందుకు ఆ పార్టీ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలవడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఏర్పడింది. ఆయనను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడంతో ద్వారా పార్టీ అధినేత ప్రాధాన్యమిచ్చారు. గ్రామాలు, మండలాలవారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ‘మీకు పూర్తిస్థాయిలో నేను అండగా ఉంటా. అందుబాటులో ఉంటా.
పార్టీ వీడాల్సిన పనిలేదు’ అంటూ భరోసా ఇస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లినప్పటికీ కార్యకర్తలు మాత్రం తనతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా, ఒకప్పుడు తనకు సన్నిహితుడైన తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఇలా ఒకవైపు తుమ్మల, మరోవైపు సండ్ర.. వ్యూహ, ప్రతివ్యూహాలతో సత్తుపల్లి రాజకీయం రసవత్తరంగా మారింది.
టీడీపీ శ్రేణులకు ‘గులాబీ’ వల
Published Fri, Oct 17 2014 3:11 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement