పట్టం పట్నంకే..
* రంగారెడ్డి జిల్లా పరిషత్ కూడా గులాబీదే
* చైర్‌పర్సన్‌గా పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నిక
* కాంగ్రెస్‌ను కాదని టీఆర్‌ఎస్‌తో టీడీపీ దోస్తీ
* ‘దేశం’కు వైస్ చైర్మన్ పదవి.. చక్రం తిప్పిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘పాలమూరు ఫార్ములా’తో అధికార టీఆర్‌ఎస్ రంగారెడ్డి జెడ్పీనీ కైవసం చేసుకుంది. టీడీపీతో జతకట్టి జెడ్పీ పీఠంపై గులాబీ గుభాళించింది. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏడుగురు తెలుగుదేశం జెడ్పీటీసీలు మూకుమ్మడిగా.. టీఆర్‌ఎస్‌ను బలపరిచారు. అంతేకాక కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో ఇద్దరు సభ్యులు కూడా అధికారపార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి రెండోసారి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పంచుకోవడానికి పవర్‌షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనతో కంగుతిన్నాయి. రంగారెడ్డి జెడ్పీని కైవసం చేసుకోవడానికి ఏమాత్రం బలంలేని టీఆర్‌ఎస్.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన తొమ్మిది మంది జెడ్పీటీసీలను తనవైపునకు తిప్పుకుని చైర్‌పర్సన్ పదవిని సునాయాసంగా కైవసం చేసుకుంది.
ఆదివారం ఉదయం వరకు.. కాంగ్రెస్-టీడీపీల కూటమి నుంచే చైర్‌పర్సన్ ఎన్నికవుతారనే ప్రచారం జరిగింది. పదవీ కాలం పంచుకోవడంలో ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నదానిపై సందిగ్ధం ఉన్నా.. టీఆర్‌ఎస్‌కు జెడ్పీ పీఠం దక్కకుండా చేయాలని రెండుపార్టీల నాయకత్వాలు భావించాయి. కానీ, మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో తనకున్న పాత పరిచయాలను అనుకూలంగా మార్చుకుని వారి ఆశలపై నీళ్లు చల్లారు. టీడీపీ జెడ్పీటీసీలు ఎవరూ చేజారిపోకుండా ఆయన ముందునుంచీ వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌తో అంతర్గతంగా జరుగుతున్న ఒప్పందం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. టీడీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ ఎనిమిది జెడ్పీలలో నల్లగొండ మినహా మిగిలిన ఏడింటిలో విజయకేతనం ఎగురవేసింది. ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, మండల పరిషత్‌ల ఎన్నికలు హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వాయిదాపడ్డాయి.
రెండు మినహా అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి..
ఈ నెల 4న ఎన్నికలు వాయిదా పడిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్, హన్మకొండ మండల పరిషత్‌లలో ఎన్నిక మళ్లీ వాయిదాపడింది. కరీంనగర్ జిల్లా ముత్తారం, మహాముత్తారం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మెదక్ జిల్లా సదాశివపేట, నల్లగొండ జిల్లా మునగాల, యాదగిరిగుట్ల, భువనగిరి, ఆత్మకూరు, నిజామాబాద్‌లోని బిక్కనూరు, రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల, శంషాబాద్, కీసర, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, వెంకటాపురం, నల్లబెల్లి, జనగామలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు, నల్లగొండ జిల్లా చివ్వెంల, గరిడేపల్లిల్లో ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయినట్లు అధికారవర్గాలు వివరించాయి.