తెలంగాణకు ప్రత్యేక తపాలా సర్కిల్
- రాష్ట్రంలో మరో తపాలా రీజియన్ ఏర్పాటు
- పిన్ నంబర్లు మాత్రం పాతవే
- కొత్తగా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పోస్టు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విడివిడిగా పోస్టల్ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ స్వయంగా సీఎం కేసీఆర్‌కు చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం దాన్ని విభజించినా.. పిన్‌కోడ్ నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆ విభా గం అధికారులు చెబుతున్నారు. పిన్‌కోడ్‌లుగా ప్రస్తుతం జిల్లాల వారీగా ఉన్న నంబర్లు ఇకపై కూడా అలాగే కొనసాగనున్నాయి. వాస్తవానికి రాష్ట్ర సరిహద్దులతో తపాలాశాఖకు సంబంధం ఉండదు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఒకే సర్కిల్‌గా కొనసాగించే అవకాశం ఉంది.
ఈ మేరకు తెలంగాణ, ఏపీలను ఒకే సర్కిల్ కింద కొనసాగించాలని తొలుత కేంద్రం అనుకున్నా... రాజకీయ ఒత్తిడి, భౌగోళికంగా 2 రాష్ట్రాలు విశాలంగా ఉండటంతో విభజించేందుకే కేంద్రం మొగ్గుచూపింది. ఆరు డిజిట్లు ఉండే పిన్‌కోడ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో 500 సంఖ్య (తొలి మూడు డిజిట్లు) నుంచి 535 సంఖ్య వరకు అమల్లో ఉన్నాయి.
దీని తర్వాతి సిరీస్ సంఖ్య కర్ణాటక సర్కిల్ పరిధిలో కొనసాగుతోంది. వెరసి 500 సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక రాష్ట్రాల మధ్య ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య వరుస క్రమంలో ఈ సిరీస్ కొనసాగుతున్నందున.. రాష్ట్రాలు విడిపోతే వాటిని మార్చ టం ఇబ్బందికరం. దీంతో ప్రస్తుత పిన్‌కోడ్ నంబర్లు యధావిధిగా అమలవుతాయి.
ప్రధాన మార్పులు ఇలా..
ప్రస్తుతం ఏపీ సర్కిల్ పేరుతో ఉన్న చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి తెలంగాణకు అదనంగా కొత్త పోస్ట్ కేటాయిస్తారు.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైద రాబాద్ సిటీ రీజియన్, మిగతా జిల్లాలకు కలిపి హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. వీటి పరిధిలో 13 తపాలా డివిజన్లున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే తెలంగాణ సర్కిల్ పరిధిలో మరో రీజియన్‌ను అదనంగా ఏర్పాటు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు రీజియన్లున్నాయి. వీటిపరిధిలో 36 తపాలా డివిజన్లున్నాయి. ప్రస్తుత ఆంధప్రదేశ్ సర్కిల్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమవుతుంది.
హైదరాబాద్ అబిడ్స్‌లో జనరల్ పోస్టాఫీసు (జీపీవో) తరహాలో ఏపీ రాజధానిలో ఒకటి కొత్తగా ఏర్పాటు చేస్తారు. అక్కడే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్రం నిధులిస్తుంది. అప్పటివరకు రెండు సర్కిళ్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెయిల్ మోటార్ సర్వీసు (ఎంఎంఎస్) తరహా వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఏపీ సర్కిల్ పరిధిలో 16 వేల సాధారణ పోస్టాఫీసులు, 2,500 డిపార్ట్‌మెంటల్ పోస్టాఫీసులున్నాయి. తెలంగాణలో రెండూ కలిపి 8,500 వరకు ఉన్నాయి. ఇవి ఏ ప్రాంతానివి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రస్తుతం విజయవాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాను తెలంగాణ పరిధిలోకి మారుస్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీసుల సంఖ్య పెరుగుతుంది.
ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 45 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి విభజనకు కేంద్రం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తుంది.