ప్రైవేట్‌ కండక్టర్ల చేతికి టికెట్‌ మెషిన్లు | TS RTC Distribute Ticket Issuing Machines to Private Conductors | Sakshi
Sakshi News home page

టిమ్స్‌.. టికెట్‌

Published Sat, Oct 12 2019 1:26 PM | Last Updated on Wed, Oct 16 2019 1:34 PM

TS RTC Distribute Ticket Issuing Machines to Private Conductors - Sakshi

బస్సులో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు చార్జీలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ప్రైవేట్‌ కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడికక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతుండడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీఏ అధికారులు నగరంలో పలు చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ సైతం చర్యలు తీసుకుంటోంది. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు సెలవులు ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. శివార్లలోని ఇంజినీరింగ్‌ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటుంది. కానీ ఈలోగా సమ్మె ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న బస్సులన్నింటిలో టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌ (టిమ్స్‌)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి వినియోగంపై ప్రైవేట్‌ కండక్టర్లకు శిక్షణనిచ్చి రెగ్యులర్‌ సిబ్బంది తరహాలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు. 

‘టిమ్స్‌’తో సేవలు పారదర్శకం...
ప్రస్తుతం టికెట్ల జారీ విధానం లేకుండా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రూట్‌లో ఏ కండక్టర్‌ నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే విషయంపై  అధికారులకు అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రైవేట్‌ కండక్టర్లు కచ్చితంగా టికెట్‌ మెషిన్లను వినియోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడమే మంచిదని అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. టికెట్ల జారీతో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో ఆయా రూట్‌లలో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత వస్తుంది. అలాగే సిటీ బస్సుల నిర్వహణపై డ్రైవర్లకు కూడా  అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది కండక్టర్లు, డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. శుక్రవారం నాటికి 1300 బస్సులను రోడ్డెక్కించినట్లు అధికారులు తెలిపారు. మరో 2,300లకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

అధికారుల హెచ్చరిక...  
ప్రయాణికుల నుంచి చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతీయ రవాణా అధికారి సీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శీతల్‌ చౌహాన్‌ బృందం అక్కడి బస్టాప్‌ వద్ద తనిఖీలు నిర్వహించింది. మెహిదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లను సీరియస్‌గా హెచ్చరించింది. ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు తీసుకుంటే డ్యూటీలోకి తీసుకోబోమని, నేరుగా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో  ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కండక్టర్ల వద్దనున్న టికెట్‌ చార్ట్‌లను పరిశీలించారు. చార్ట్‌ ప్రకారమే డబ్బులివ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement