
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటీకరణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని నిలిపివేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను తమ ముందు ఉంచాలని తెలిపింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి(నవంబర్ 11) వాయిదా వేసింది.
అదే రోజు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది. అధికారులు సమర్పించిన లెక్కలు గజిబిజిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదని.. ఔదార్యం అని సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ వద్ద నుంచి అనుమతి తీసుకోలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment