సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలను క్షమించబోమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ కార్యాలయాన్ని బస్‌భవన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ విజిలెన్స్ రామ్‌చందర్‌రావు, చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్ ఆదేశాల మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఏంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో టీఎంయూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి షాక్ తగిలినట్టైంది. ఇక రానున్న కాలంలో యూనియన్లకు గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది.
కార్మిక నేతల రిలీఫ్ డ్యూటీ రద్దు..
ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర కమిటీలోని 30 మంది కార్మిక నేతలకు విధుల నుంచి మినహాయింపు(రిలీఫ్ డ్యూటీ)ను రద్దు చేసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో 26 మందికి, ఎంప్లాయిస్ యూనియన్‌లో ముగ్గురికి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో ఒక్కరి చొప్పున రిలీఫ్ డ్యూటీని రద్దు చేసినట్లు ప్రకటించింది. రిలీఫ్ డ్యూటీ అంటే.. కార్మికుల ఇబ్బందుల పరిష్కారం కోసం పనిచేసేందుకుగానూ కార్మిక నేతలకు డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. విధులకు హాజరు కాకున్నా యాజమాన్యం పూర్తిస్థాయి జీతం చెల్లించేది. జిల్లాలో జోనల్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు ఫుల్ డే రిలీఫ్, హాఫ్ డే రిలీఫ్‌లు వారానికి మూడురోజులు వర్తింపజేసేది. వీరితోపాటు రీజినల్ సెక్రటరీలకు, డిపో కార్యదర్శిలకు వారానికి ఒక రోజు వేతనం చెల్లించేవారు. వీటిని రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో ఇకమీదట కార్మిక నేతలెవరికీ రిలీఫ్ డ్యూటీలు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment