
సాక్షి, హైదరాబాద్: చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో నిండిన శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తడంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తడారిన గొంతుల్ని నింపేలా... ఆయకట్టు పంటలకు ప్రాణం పోసేలా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం రాగా శుక్రవారానికి అది మరింత పెరిగే అవకాశం ఉంది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకుగానూ 530 అడుగుల వద్ద 168.15 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇకపై వచ్చేదంతా సాగర్‌కే...
కృష్ణా నదీ బేసిన్‌లోని సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో అక్కడ వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు రోజూ స్థిరంగా 65 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఈ నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదలడం, ఈ ప్రవాహానికి సుంకేశుల నుంచి వస్తున్న 35 వేల క్యూసెక్కుల వరద తోడవడంతో శ్రీశైలంలోకి 86 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 213 టీఎంసీలకు చేరడంతో గురువారం ఉదయం రెండు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు.
దీనికి అదనంగా కుడి, ఎడమ కాల్వల పవర్‌హౌస్‌ల ద్వారా ఏపీ, తెలంగాణ అధికారులు నీటిని వినియోగించడంతో శ్రీశైలం నుంచి దిగువనున్న సాగర్‌కు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నీటి నిల్వ 168.15 టీఎంసీలకు చేరింది. మరో 143.9 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువన అన్ని ప్రాజెక్టుల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇకపై వచ్చిన ప్రవాహాలు వచ్చినట్లుగా సాగర్‌కే రానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరే ప్రవాహాలు వచ్చినా 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముంది.
గోదావరిలోనూ ఆశాజనకం..
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి కూడా ప్రవాహాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. బుధవారం 19 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లోకి 34,200 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిల్వ 40 టీఎంసీలకు చేరగా, మరో 50 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. సింగూరుకు సైతం 11,906 క్యూసె క్కుల మేర ప్రవాహం వస్తుండటం, ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోవడంతో 8,939 క్యూసెక్కుల నీటిని నిజాం సాగర్‌కు వదులుతున్నారు. దీంతోపాటే ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ ప్రాజెక్టులకూ ప్రవాహాలు వస్తున్నాయి.
క్రాప్ హాలిడే భయం తొలిగినట్లే...
సాగర్‌లోకి ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవాహాలతో పరీవాహక రైతాంగం రబీ సాగుపై గంపెడాశలు పెట్టుకుంది. సాగర్ కింద మొత్తంగా 6,40,814 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా గత రెండేళ్లుగా ఇక్కడ అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. నీటి కొరత కారణంగా 2015–16లో ఒక్క ఎకరానికీ నీరు అందలేదు. 2016–17 ఖరీఫ్‌లో కేవలం 2.140 లక్షల ఎకరాలకు నీరివ్వగా రబీలో 4.15 లక్షల ఎకరాలకు నీరందించారు. ప్రస్తుత ఏడాదిలో నీటి కొరత కారణంగా ఖరీఫ్‌లో ఒక్క ఎకరానూ తడిపే పరిస్థితి రాలేదు. తాగునీటికే కొరత ఏర్పడటంతో కనీస నీటిమట్టం 510 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ప్రస్తుతం రబీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రబీ కింది సాగు అవసరాలకు రాష్ట్రం 54.30 టీఎంసీల కేటాయింపులు కోరింది. దీనిపై ఈ నెల 16 తర్వాత జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక సాధారణంగా సాగర్ కింద 5 తడులకు నీళ్లివ్వాల్సి ఉండగా బోర్డు కేటాయించే నీటినిబట్టి ఎన్ని తడులనేది నిర్ణయమవుతుందని, క్రాప్ హాలిడే మాత్రం ఉండదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment