
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర పద్ధతుల్లో విద్యుదుత్పాదనకు వీలుగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. పవన, సౌర విద్యుదుత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,700 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు.
సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సోమారపు సత్యనారాయణ, గువ్వల బాలరాజు, జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుదుత్పత్తిని తగ్గించాలని నిపుణులు సూచించారని.. అయితే సౌర, పవన విద్యుదుత్పత్తిపై ఆధారపడటం ఇబ్బందులను తెచ్చిపెడుతుందని చెప్పారు.
పవన విద్యుత్ ఉత్పత్తి విషయంలో నెలకొనే అస్థిరత గ్రిడ్లకు ప్రమాదకరంగా మారుతుందని, సౌర విద్యుత్ నిల్వ భారీ వ్యయంతో కూడుకున్న ప్రక్రియ అని వివరించారు. అయినా ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న కొత్త పరిశోధనలను పరిశీలిస్తున్నామని, రాష్ట్రానికి అనువైన విధానం అవలంబిస్తామని పేర్కొన్నారు.