సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నవంబరులో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ సీజన్ ఈ ఏడాది మార్చి నాటికి ముగిసింది. రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలు 24.14 మెట్రిక్ టన్నులను గానుగ ఆడించగా, 25.65లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయింది. క్రషింగ్ సీజన్ ముగిసినా కర్మాగారాలకు చెరుకు సరఫరా చేసిన రైతులకు బిల్లులు అందడం లేదు. చక్కెర నిల్వలు తమ వద్ద పేరుకు పోవడం వల్లే బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు కర్మాగారాలు చెప్తున్నాయి. సహకార రంగంలోని నిజామాబాద్ చక్కెర ఫ్యాక్టరీతో పాటు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని మూడు నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలే పనిచేస్తున్నాయి.
2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలకు రైతులు 24.14లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును సరఫరా చేశారు. టన్నుకు రూ.2,750 వంతున కేంద్ర ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర (ఎఫ్‌ఆర్‌పీ) ప్రకటించింది. ఈ ధర ఆధారంగా కర్మాగారాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టన్ను చెరుకు ధరను రూ.2,845 మొదలుకుని రూ.3,179 వరకు నిర్ణయించాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ముగిసింది. రైతులు సరఫరా చేసిన చెరుకుకు రూ.729.69 కోట్లు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు చెరుకు సరఫరా చేసిన 14 రోజుల వ్యవధిలో రైతులకు రావాల్సిన డబ్బులను కర్మాగారాలు చెల్లించాలి. అధికారిక లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులకు రూ.476.57 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. మరో రూ.253 కోట్లు కర్మాగారాల నుంచి రైతులకు అందాల్సి ఉంది.
చేతులెత్తేస్తున్న కర్మాగారాలు
రాష్ట్రంలో ఏడు ప్రైవేటు చక్కెర కర్మాగారాలు ఉండగా.. గణపతి, కాకతీయ వంటి ఒకటి రెండు పరిశ్రమలు మాత్రమే 70శాతానికి పైగా బకాయిలను రైతులకు చెల్లించాయి. కాకతీయ, ట్రైడెంట్ వంటి పరిశ్రమలు రైతులకు తాము చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 30 నుంచి 40శాతం వరకే ఇచ్చాయి. దీంతో క్రషింగ్ సీజన్ ముగిసినా డబ్బులు చేతికి రాక రైతులు ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపునకు చెరుకు, చక్కెర శాఖ.. కలెక్టర్ల సమక్షంలో రైతులు, ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వినియోగానికి మంచి చక్కెర ఉత్పత్తి చేయడం, బయటి మార్కెట్‌లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, కర్మాగారాల్లో చక్కెర నిల్వలు పేరుకు పోవడం తదితరాలను ఫ్యాక్టరీ యాజమాన్యాలు కారణంగా చూపుతున్నాయి. దేశీయ మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, అంతర్జా తీయ మార్కెట్లో డిమాండు లేకపోవడంతో తమ పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదని అంటున్నా యి. చక్కెర నిల్వలు విక్రయిస్తేనే బకాయిలు చెల్లిం పు సాధ్యమవుతుందని చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి చక్కెర మార్కెట్ పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొరడా ఝలిపించేందుకు వెనుకంజ
బిల్లుల చెల్లింపులో ఫ్యాక్టరీల యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నా.. వారిపై చర్యలు తీసుకునేందుకు చక్కెర శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కొన్ని పరిశ్రమలు గత ఏడాది డిసెంబర్ వరకూ చెల్లిస్తూ వచ్చాయి. అవి చెల్లించని యాజమాన్యాలపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వీలున్నా.. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసే పక్షంలో నిల్వల విక్రయం, బకాయిల చెల్లింపు భారం అధికారుల మీద పడనుంది. సకాలంలో నిల్వలను విక్రయించని పక్షంలో రైతుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తాము భరించాల్సి ఉంటుందనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన బకాయిల కోసం వేచి వుండటం మినహా.. రైతులకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment