గోవాడకు ముసలం | Factory although there will be private? | Sakshi
Sakshi News home page

గోవాడకు ముసలం

Published Fri, Feb 13 2015 12:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

గోవాడకు ముసలం - Sakshi

గోవాడకు ముసలం

ప్రైవేటు  పరం కానున్న ఫ్యాక్టరీ?
దక్కించుకునే పనిలో అధికారపార్టీ నాయకులు
95యాక్టులోకి మార్చేందుకు చైర్మన్ వ్యూహం!
మిల్లుపై రైతులు హక్కు కోల్పోయే ప్రమాదం

 
‘గోవాడ’ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది తీయని పంచదార. సహకార రంగంలోని ఈ మిల్లు ప్రైవేటు ఫ్యాక్టరీలకు దీటుగా ఏటా లక్షలాది టన్నుల చెరకు క్రషింగ్‌తో లాభాల బాటలో పయనిస్తోంది. 25వేల మంది సభ్య రైతులకు ఆసరాగా ఉన్న ఈ  కర్మాగారంపై ఇప్పుడు పెద్దల కన్ను పడింది. దీనిని తమ సొంత చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ఐదు దశాబ్దాలపాటు ప్రత్యక్షంగా,పరోక్షంగా లక్షమందికి జీవనాధారమైన ఈ ఫ్యాక్టరీ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు గురై జీవనాధారం కోల్పోతామోనన్న భయం రైతుల్లో నెలకొంది.
 
చోడవరం: ఏటా రూ.150 కోట్లకు పైబడి లావాదేవీలు సాగే గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని దక్కించుకోవాలని కార్పొరేట్ సంస్థల యజమానులతోపాటు అధికార టీడీపీలో పలుకుబడి ఉన్న అనేక మంది బడా నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం తీరే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వతహాగా సహకార రంగానికి వ్యతిరేకమని ముద్రవేసుకున్న సీఎం చంద్రబాబునాయుడు 1999లోనే నష్టాల పేరుతో రాష్ట్రంలో ఉన్న చక్కెర కర్మాగారాలను అమ్మేయాలనిప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇదే యోచన మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు ప్రస్తుత పరిస్థితులు చెప్పకనేచెబుతున్నాయి. ఫ్యాక్టరీల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలో చక్కెర పారిశ్రామిక వేత్తలైన సుధాకర చౌదరి లాంటి వ్యక్తులను నియమించడమే ఇందుకు నిదర్శనం. నష్టాలు చూపి వాటిని తెగనమ్మాలన్నదే తెరవెనుక వ్యూహమన్నది జగమెరిగిన సత్యం. రైతుల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఇప్పటికే సుధాకర చౌదరి ఈ ఫ్యాక్టరీని తన వశం  చేసుకోవడానికి అన్నిప్రయత్నాలు జోరుగా చేస్తున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో సాగుతోంది. కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని లాభాలు అందించే గోవాడ ఫ్యాక్టరీ అంటే ఎవరికి ఇష్టముండదు.

అందుకే ఈ ఫ్యాక్టరీని తన కనుసన్నల్లోనే ఉంచుకోవాలని టీడీపీ నాయకుడైన ప్రస్తుత చైర్మన్ గూనూరు మల్లునాయుడు కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మే ప్రయత్నం చేస్తే విశాఖ డెయిరీ మాదిరీ దీనిని 95యాక్టులోకి తీసుకెళ్లేందుకు చైర్మన్ అన్నీ సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు. 95యాక్టులోకి వెళితే ఇక ప్రభుత్వ పెత్తనం ఏమీ ఉండదు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటాధనం సుమారు రూ.10కోట్లు వరకు ఉంది. మరో రూ.8కోట్లు వరకు షేరుధనం రూపంలో రైతుల వాటా ఉంది. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న రైతుల పేర్లతో తానే షేరు ధనాన్ని సమకూర్చి ప్రభుత్వ వాటా ఇచ్చేసి 95 కంపెనీ చట్టంలోకి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ యాక్టులోనూ ముసలం ఉంది. పేరుకి రైతు భాగస్వామి అని ఉన్నా ఇప్పుడు విశాఖ డెయిరీ ఎలా ఒక వ్యక్తి ఆధిపత్యంలో ఉందో అదే పరిస్థితి గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి కూడా వస్తుంది. అంటే రైతులు పూర్తిగా తమ హక్కులు కోల్పోయి పెత్తందారీ చేతిలో కీలుబొమ్మ అయ్యే ప్రమాదం పొంచివుంది. సుమారు రూ.25కోట్లతో త్వరలో దీనిని విస్తరించనున్న సమయంలో    ఇటువంటి పరిస్థితులు నెలకొనడం రైతులు, కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసలు దీనికి ముసలం తెస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు వ్యతిరేక విధానాలేనని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement