sugarcane crushing
-
పెరిగిన చక్కెర ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో చక్కెర ఉత్పత్తి రెండు రెట్లు పెరిగి 42.9 లక్షల టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఉత్పత్తి 20.72 లక్షల టన్నులుగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. ఈ సీజన్లో షుగర్‌కేన్ క్రషింగ్ త్వరగా ప్రారంభం కావటమే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణమని ఐఎస్ఎంఏ పేర్కొంది. 2018–19 సంవత్సరంలోనూ ప్రొడక్షన్స్ ఇదే తీరులో జరిగిందని.. ఆ సమయంలో 418 షుగర్ మిల్లుల నుంచి 40.69 లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్లో ఉత్తర ప్రదేశ్ అత్యధికంగా చక్కెర ఉత్పత్తి జరిగింది. గతేడాది 11.46 లక్షల టన్నులుండగా.. ప్రస్తుతమిది 12.65 లక్షల టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 15.72 లక్షల టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 1.38 లక్షల టన్నులుగా ఉంది. కర్నాటకలో 5.62 లక్షల టన్నుల నుంచి 11.11 లక్షల టన్నులకు పెరిగింది. ప్రస్తుత సీజన్లో ప్రధాన రాష్ట్రాల్లో సగటు షుగర్ మిల్ చక్కెర ధరలు తగ్గినట్లు ఇస్మా గుర్తించింది. -
తీపి పంటతో...చేదు కష్టాలు..!
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది నవంబరులో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ సీజన్ ఈ ఏడాది మార్చి నాటికి ముగిసింది. రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలు 24.14 మెట్రిక్ టన్నులను గానుగ ఆడించగా, 25.65లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయింది. క్రషింగ్ సీజన్ ముగిసినా కర్మాగారాలకు చెరుకు సరఫరా చేసిన రైతులకు బిల్లులు అందడం లేదు. చక్కెర నిల్వలు తమ వద్ద పేరుకు పోవడం వల్లే బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు కర్మాగారాలు చెప్తున్నాయి. సహకార రంగంలోని నిజామాబాద్ చక్కెర ఫ్యాక్టరీతో పాటు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోని మూడు నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ కర్మాగారాలు కూడా మూత పడ్డాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలే పనిచేస్తున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఏడు చక్కెర కర్మాగారాలకు రైతులు 24.14లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును సరఫరా చేశారు. టన్నుకు రూ.2,750 వంతున కేంద్ర ప్రభుత్వం చెరుకుకు మద్దతు ధర (ఎఫ్ఆర్పీ) ప్రకటించింది. ఈ ధర ఆధారంగా కర్మాగారాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టన్ను చెరుకు ధరను రూ.2,845 మొదలుకుని రూ.3,179 వరకు నిర్ణయించాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన చెరుకు క్రషింగ్ ఈ ఏడాది మార్చి నెలాఖరుకు ముగిసింది. రైతులు సరఫరా చేసిన చెరుకుకు రూ.729.69 కోట్లు చక్కెర కర్మాగారాలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు చెరుకు సరఫరా చేసిన 14 రోజుల వ్యవధిలో రైతులకు రావాల్సిన డబ్బులను కర్మాగారాలు చెల్లించాలి. అధికారిక లెక్కల ప్రకారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులకు రూ.476.57 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. మరో రూ.253 కోట్లు కర్మాగారాల నుంచి రైతులకు అందాల్సి ఉంది. చేతులెత్తేస్తున్న కర్మాగారాలు రాష్ట్రంలో ఏడు ప్రైవేటు చక్కెర కర్మాగారాలు ఉండగా.. గణపతి, కాకతీయ వంటి ఒకటి రెండు పరిశ్రమలు మాత్రమే 70శాతానికి పైగా బకాయిలను రైతులకు చెల్లించాయి. కాకతీయ, ట్రైడెంట్ వంటి పరిశ్రమలు రైతులకు తాము చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 30 నుంచి 40శాతం వరకే ఇచ్చాయి. దీంతో క్రషింగ్ సీజన్ ముగిసినా డబ్బులు చేతికి రాక రైతులు ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల చెల్లింపునకు చెరుకు, చక్కెర శాఖ.. కలెక్టర్ల సమక్షంలో రైతులు, ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వినియోగానికి మంచి చక్కెర ఉత్పత్తి చేయడం, బయటి మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, కర్మాగారాల్లో చక్కెర నిల్వలు పేరుకు పోవడం తదితరాలను ఫ్యాక్టరీ యాజమాన్యాలు కారణంగా చూపుతున్నాయి. దేశీయ మార్కెట్లో చక్కెర ధర ఆశాజనకంగా లేకపోవడం, అంతర్జా తీయ మార్కెట్లో డిమాండు లేకపోవడంతో తమ పెట్టుబడి కూడా వెనక్కి రావడం లేదని అంటున్నా యి. చక్కెర నిల్వలు విక్రయిస్తేనే బకాయిలు చెల్లిం పు సాధ్యమవుతుందని చెప్తున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి చక్కెర మార్కెట్ పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొరడా ఝలిపించేందుకు వెనుకంజ బిల్లుల చెల్లింపులో ఫ్యాక్టరీల యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నా.. వారిపై చర్యలు తీసుకునేందుకు చక్కెర శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కొన్ని పరిశ్రమలు గత ఏడాది డిసెంబర్ వరకూ చెల్లిస్తూ వచ్చాయి. అవి చెల్లించని యాజమాన్యాలపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వీలున్నా.. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసే పక్షంలో నిల్వల విక్రయం, బకాయిల చెల్లింపు భారం అధికారుల మీద పడనుంది. సకాలంలో నిల్వలను విక్రయించని పక్షంలో రైతుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తాము భరించాల్సి ఉంటుందనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన బకాయిల కోసం వేచి వుండటం మినహా.. రైతులకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. -
చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గింది...
న్యూఢిల్లీ: దేశంలో చక్కెర ఉత్పత్తి 2016-17 సీజన్ తొలి నెల అక్టోబర్‌లో 44% క్షీణతతో 1.04 లక్షల టన్నులకు పరిమితమరుుంది. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు క్రషింగ్ ఆలస్యం కావడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్(ఐఎస్ఎంఏ) పేర్కొంది. 2015-16 సీజన్ ఇదే నెలలో చక్కెర ఉత్పత్తి 1.87 లక్షల టన్నులుగా ఉందని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో 65 మిల్లులు చెరకు క్రషింగ్‌ను ప్రారంభిస్తే.. ప్రస్తుత ఏడాది అదే నెలలో కేవలం 28 మిల్లులే చెరకు క్రషింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయని వివరించింది. -
గోవాడకు ముసలం
ప్రైవేటు పరం కానున్న ఫ్యాక్టరీ? దక్కించుకునే పనిలో అధికారపార్టీ నాయకులు 95యాక్టులోకి మార్చేందుకు చైర్మన్ వ్యూహం! మిల్లుపై రైతులు హక్కు కోల్పోయే ప్రమాదం ‘గోవాడ’ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది తీయని పంచదార. సహకార రంగంలోని ఈ మిల్లు ప్రైవేటు ఫ్యాక్టరీలకు దీటుగా ఏటా లక్షలాది టన్నుల చెరకు క్రషింగ్‌తో లాభాల బాటలో పయనిస్తోంది. 25వేల మంది సభ్య రైతులకు ఆసరాగా ఉన్న ఈ కర్మాగారంపై ఇప్పుడు పెద్దల కన్ను పడింది. దీనిని తమ సొంత చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ఐదు దశాబ్దాలపాటు ప్రత్యక్షంగా,పరోక్షంగా లక్షమందికి జీవనాధారమైన ఈ ఫ్యాక్టరీ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు గురై జీవనాధారం కోల్పోతామోనన్న భయం రైతుల్లో నెలకొంది. చోడవరం: ఏటా రూ.150 కోట్లకు పైబడి లావాదేవీలు సాగే గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని దక్కించుకోవాలని కార్పొరేట్ సంస్థల యజమానులతోపాటు అధికార టీడీపీలో పలుకుబడి ఉన్న అనేక మంది బడా నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం తీరే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వతహాగా సహకార రంగానికి వ్యతిరేకమని ముద్రవేసుకున్న సీఎం చంద్రబాబునాయుడు 1999లోనే నష్టాల పేరుతో రాష్ట్రంలో ఉన్న చక్కెర కర్మాగారాలను అమ్మేయాలనిప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇదే యోచన మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు ప్రస్తుత పరిస్థితులు చెప్పకనేచెబుతున్నాయి. ఫ్యాక్టరీల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలో చక్కెర పారిశ్రామిక వేత్తలైన సుధాకర చౌదరి లాంటి వ్యక్తులను నియమించడమే ఇందుకు నిదర్శనం. నష్టాలు చూపి వాటిని తెగనమ్మాలన్నదే తెరవెనుక వ్యూహమన్నది జగమెరిగిన సత్యం. రైతుల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఇప్పటికే సుధాకర చౌదరి ఈ ఫ్యాక్టరీని తన వశం చేసుకోవడానికి అన్నిప్రయత్నాలు జోరుగా చేస్తున్నారనే ప్రచారం ఈ ప్రాంతంలో సాగుతోంది. కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని లాభాలు అందించే గోవాడ ఫ్యాక్టరీ అంటే ఎవరికి ఇష్టముండదు. అందుకే ఈ ఫ్యాక్టరీని తన కనుసన్నల్లోనే ఉంచుకోవాలని టీడీపీ నాయకుడైన ప్రస్తుత చైర్మన్ గూనూరు మల్లునాయుడు కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మే ప్రయత్నం చేస్తే విశాఖ డెయిరీ మాదిరీ దీనిని 95యాక్టులోకి తీసుకెళ్లేందుకు చైర్మన్ అన్నీ సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు. 95యాక్టులోకి వెళితే ఇక ప్రభుత్వ పెత్తనం ఏమీ ఉండదు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటాధనం సుమారు రూ.10కోట్లు వరకు ఉంది. మరో రూ.8కోట్లు వరకు షేరుధనం రూపంలో రైతుల వాటా ఉంది. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న రైతుల పేర్లతో తానే షేరు ధనాన్ని సమకూర్చి ప్రభుత్వ వాటా ఇచ్చేసి 95 కంపెనీ చట్టంలోకి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ యాక్టులోనూ ముసలం ఉంది. పేరుకి రైతు భాగస్వామి అని ఉన్నా ఇప్పుడు విశాఖ డెయిరీ ఎలా ఒక వ్యక్తి ఆధిపత్యంలో ఉందో అదే పరిస్థితి గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి కూడా వస్తుంది. అంటే రైతులు పూర్తిగా తమ హక్కులు కోల్పోయి పెత్తందారీ చేతిలో కీలుబొమ్మ అయ్యే ప్రమాదం పొంచివుంది. సుమారు రూ.25కోట్లతో త్వరలో దీనిని విస్తరించనున్న సమయంలో ఇటువంటి పరిస్థితులు నెలకొనడం రైతులు, కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అసలు దీనికి ముసలం తెస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు వ్యతిరేక విధానాలేనని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
క్రషింగ్ ప్రశ్నార్థకం
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. నేటికీ క్రషింగ్ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో 1.80 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ సిద్ధంగా ఉంది. బాయిలర్ మరమ్మతులు నేటికీ ప్రారంభించకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా చిత్తూరు, ఆర్థికశాఖామంత్రి జిల్లా నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లోని సహకార కర్మాగారాలు బకాయిలు పూర్తిగా చెల్లించాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోవూరు చక్కెర కర్మాగారం రైతులకు రూ.5.40 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4.80 కోట్లు చెల్లించా ల్సి ఉంది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ జరపాల్సి ఉంటే రూ.4 కోట్లు మరమ్మతులకు అవసరం ఉంది. గతేడాది ప్రారంభం నుంచే ఫ్యాక్టరీలో క్రషింగ్ ముగిసే వరకు బాయిలర్ మరమ్మతులకు గురికావడం ప్రధాన సమస్యగా మారింది. గత ఏడాది బాయిలర్ మరమ్మతులు చేపట్టినా తరచూ మరమ్మతులకు గురువుతూనే ఉంది. ఈ ఏడాది బాయిలర్ మరమ్మతులను పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంది. బాయిలర్‌లోని 3,600 ట్యూబ్‌లను మరమ్మతులు చేయాలంటే దాదాపు రెండు నెలల సమయం పడుతుందిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కోవూరులో నిర్వహించిన రచ్చబండ సందర్భంగా చక్కెర కర్మాగారం బకాయిలు, ఇతర అవసరాలకు నిధులు విడుదల చేస్తానని చెప్పిన మంత్రి ఆనం మాటలు నేటికీ నోచుకోలేదు. ఈ క్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కర్మాగారం పరిస్థితిపై సీఎం కిరణ్, మంత్రి ఆనంని కలిసి విన్నవించారు. క్రషింగ్ ఆలస్యమవుతుండటంతో చెరకును జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్‌ను కోరారు. దీంతో కలెక్టర్ నాయుడుపేట చక్కెర కర్మాగారంలో నిత్యం వెయ్యి టన్నులు క్రషింగ్ జరిపేం దుకు ఒప్పందం కుదిర్చారు. అయితే దాదాపు మూడు నెలల పాటు క్రషింగ్ జరిగినా నెలకు ముప్పై వేల టన్నుల చొప్పున క్రషింగ్ ముగిసే నాటికి కేవలం 90 వేల టన్నులు మాత్రం క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. మిగతా 90 వేల టన్నులు పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ఫ్రీజోన్ ప్రకటిస్తే మేలు కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో పండించిన 1.80 వేల టన్నుల చెరకు కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ అయ్యే పరిస్థితి లేదు. మరమ్మతులు చేసి ఫ్యాక్టరీ ప్రారంభించినా ముప్పై వేలకు మించి క్రషింగ్ జరిగే దాఖలాలు లేవని రైతు సంఘాలు చెబుతున్నాయి. కోవూరును ఫ్రీజోన్‌గా కలెక్టర్ శ్రీకాంత్ ప్రకటిస్తే మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ఫ్రీ జోన్ ప్రకటిస్తే రైతులు తమ చెరకును రాష్ట్రంలోని ఏ ఫ్యాక్టరీకైనా తరలించే అవకాశం ఉంది. అగ్రిమెంట్ 15 వేల టన్నులకే.. ఇప్పటి వరకు కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో క్రషింగ్ జరిపేందుకు కేవలం 15 వేల టన్నులకే అగ్రిమెంట్ అయింది. తాజాగా అధికారులు గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రిమెంట్ చేయనున్నట్లు చెబుతున్నారు. కోవూరు చక్కెర కర్మాగారం లో ప్రతి ఏడాది అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు సీజన్‌గా ప్రకటిస్తారు. నవంబరులో స్లోఫైరింగ్ చేసి, డిసెంబరులో క్రషింగ్ ప్రారంభిస్తారు. ఇంత వరకు కర్మాగారంలో స్లోఫైరింగ్ జరిగిన దాఖలాలు లేవు. కోవూరు చక్కెర కర్మాగారం ఎండీ సుధాకర్‌రెడ్డి నిర్లక్ష్యంతో గతేడాది రైతులకు తీవ్రనష్టం జరిగింది. -
తలవంచిన యాజమాన్యం
బోధన్, న్యూస్‌లైన్ : చెరుకు రైతుల ఆందోళనకు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం తలవంచింది. ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ శనివారం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. బుధవారం జరిగిన చర్చల అనంతరం పది రోజుల పాటు క్రషింగ్ నిలిపిస్తున్నట్లు ఫ్యాక్టరీ అధికారులు పేర్కొనడంతో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. గురువా రం బోధన్ బంద్ నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రవే శ ద్వారం వద్ద ధర్నాకు దిగారు. అంతకు ముం దు పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ప్రధాన వీ దుల గుండా సాగిన ర్యాలీ మధ్యాహ్నం 12 గం టలకు ధర్నా శిబిరానికి చేరుకుంది. ఈ శిబి రం లో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీ చైర్మన్ గోకరాజు గంగరాజు తీరుతో చెరుకు రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని తొల గించుకోవాలనే దురుద్దేశంలో గోకరాజు ఉన్న ట్లు సంఘం ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్కంఠకు తెర నిజాం దక్కన్ షుగర్స్‌లో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ రైతు ఫ్యాక్టరీలోపల ఉన్న ఎత్తై పవర్ ప్లాంట్ ట్యాంక్ ఎక్కి క్రషింగ్ ప్రారంభించకపోతే పైనుంచి కిందకి దూకుతానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న రైతులు ట్యాంక్ వద్దకు పరుగులు పెట్టారు. రైతును ఖాజాపూర్‌కు చెందిన చింతం సాయిలుగా గుర్తించారు. కిందకు దూకవద్దని కోరారు. డీఎస్పీ గౌస్ మోహినొద్దీన్, సీఐ శం కరయ్య, తహశీల్దార్ రాజేశ్వర్ అక్కడికి చేరుకుని ‘‘క్రషింగ్ ప్రారంభమవుతోంది..నీ చెరుకు ఫ్యాక్టరీకి తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుం టాం కిందికి దిగిరావాలని’’ మైకు ద్వారా సాయిలును కోరారు. చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు కొప్పర్తి సుబ్బారావు, కార్యదర్శి గోపాల్ రెడ్డితో చర్చించారు. అయినా రైతులు రాత్రి ఏడు గంటల వరకు రైతులు ఫ్యాక్టరీలోనే బైఠాయించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే యెండల లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ గం గాశంకర్, సీడీసీ చైర్మన్ పోతా రెడ్డి, టీడీపీ నేతలు ప్రకాష్ రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, బీజేపీ నాయకుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మండల నా యకులు రైతులతో మాట్లాడారు. నిజామాబా ద్ ఆర్డీఓ యాదిరెడ్డి సమక్షంలో చర్చలు సా గాయి. శనివారం క్రషింగ్ ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ అధికారులు అంగీకరిం చడంతో రైతు లు ఆందోళన విరమించారు. సాయిలు కిందకు దిగి వచ్చాడు. రైతు ప్రతి నిధులు పావులూరి వెంకటేశ్వర్రావు, మాజీ ఎంపీపీ గిర్దావర్ గం గారెడ్డి, కాశీనాథ్‌రెడ్డి, శివరాజ్ పాటిల్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ పాషా మోహియుద్దీన్, జేఏసీ మండల కన్వీనర్ పి. గోపాల్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశ్, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, మారుతీ రావు పటేల్, బీర్కూర్ సురేందర్, హన్మంత్‌రా వు, పోలా మల్కారెడ్డి పాల్గొన్నారు. పీడీఎస్ యూ కార్యకర్తలు చెరుకు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. -
‘డెల్టా సుగర్స్’లో చెరకు క్రషింగ్ ప్రారంభం
శేరినరసన్నపాలెం (హనుమాన్‌జంక్షన్ రూరల్), న్యూస్‌లైన్ : చెరకు రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా టన్నుకు రూ.365 చెల్లిస్తున్నామని డెల్టా సుగర్స్ కర్మాగారం సీఈవో ఎం. సుబ్బరాజు తెలిపారు. బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలోని డెల్టా సుగర్స్ కర్మాగారంలో 2013-14వ సంవత్సరం క్రషింగ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చెరకు సాగును ప్రోత్సహించడానికి రైతులకు అవసరమైన సామగ్రి, ఎరువులను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరకు ధర టన్నుకు రూ.2,125 మద్దతు ధర ప్రకటించగా, రాష్ట ప్రభుత్వం కొనుగోలు పన్ను రూ.60తో కలిపి రూ.2,185గా నిర్ణయించామని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్టులో పంచదార ధర తక్కువగా ఉన్నప్పటికీ అదనంగా టన్నుకు రూ.365 కలిపి రూ.2,550 చొప్పున రైతులకు చెల్లిస్తామన్నారు. జనరల్ మేనేజరు ఎం.రాజబాబు, కేన్ మేనేజర్ కె.వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ చెరకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి నండూరు సత్యవెంకటేశ్వరశర్మ, హనుమాన్ సుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమవరప్రసాద్, రేమల్లె సర్పంచి కలపాల జగన్మోహనరావు, వేలేరు మాజీ సర్పంచి వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.