సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ : పై ఫొటోలోని బిల్డింగ్ కరీంనగర్ నడిబొడ్డున ప్రధాన రహదారిపై నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) వాణిజ్య భవన సముదాయం. మూడంతస్థుల ఈ భవనాన్ని గత రెండేళ్లుగా ఖాళీగా ఉంచారు. ఈ భవనానికి చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలు రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన ఈ భవనాన్ని కూడా అద్దెకిస్తే ప్రతినెలా కనీసం రూ.2లక్షలకుపైగా ఆదాయం వచ్చేది.
గత రెండేళ్లుగా రూ.50లక్షల ఆదాయం అద్దె రూపంలో జమ అయ్యేది. కానీ కేడీసీసీబీ అధికారులకు ఈ భవనం గురించి ఏమాత్రం పట్టింపులేదు. అద్దెకు ఇవ్వాలనే ధ్యాస కానీ, సొంతంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన కానీ వీరికి లేదు. ఎందు కంటే అధికారుల సొంత ఆస్తి అయితే కదా! రైతుల సొమ్ము కాబట్టి ఏం చేసినా అడిగేవారు లేరనే
ధీమాతో ఉన్నారు.
కేడీసీసీ బ్యాంకుకు నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా పాత భవనం ఉంది.
ప్రస్తుతం పాత భవనం లోనే బ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ బ్యాంకు అధికారులు రెండేళ్ల క్రితం రూ.3కోట్లకుపైగా వెచ్చించి పక్కనే ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్థులో బ్యాంకింగ్ కార్యకలాపాలతోపాటు సమావేశాలకు, రెండు, మూడు అంతస్థులు అద్దెకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పీఆర్ యాక్ట్ ప్రకారం ఏ బ్యాంకు అయినా తమ సొంత ఆస్తులను అద్దెకు ఇవ్వకూడదు. సొంత అవసరాాలకే ఉపయోగించుకోవాలి. ఈ విషయం కేడీసీసీ అధికారులకూ తెలుసు. అయినప్పటికీ నగరం నడిబొడ్డున వాణిజ్య సముదాయాల ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతినెలా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని భావించారు. అనుకున్నదే తడవుగా మూడంతస్థుల భవనాన్ని అందంగా నిర్మించారు. ఒక్కో ఫ్లోర్‌లో మూడు వేలకుపైగా చదరపు అడుగుల చొప్పున నిర్మాణాలను పూర్తి చేశారు.
అందులో మొదటి ఫ్లోర్‌లో సగభాగం మాత్రమే బ్యాంకు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన సగభాగంతోపాటు పైన ఉన్న రెండంతస్థులను రెండేళ్లుగా ఖాళీగా ఉంచారు. తాము ఇచ్చే ప్రతి రూపాయిపై నిక్కచ్చిగా వడ్డీ వసూలు చేయడమే బ్యాంకుల ప్రధాన లక్ష్యమని అందరికీ తెలిసిందే. అందులోనూ రైతుల సొమ్ముతో నడిచే సహకార బ్యాంకు డబ్బును వెచ్చించే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ.కోట్లు వెచ్చించి భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వాలనుకోవడమే అధికారుల మొదటి తప్పిదం.
అయితే భవనాన్ని నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా బ్యాంకుకు ఏటా రూ.25 లక్షలకుపైగా ఆదాయాన్ని సమకూర్చాలనుకోవాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించారనే అనుకుందాం. అలాంటప్పుడు రెండేళ్లుగా ఈ భవనాన్ని ఎందుకు ఖాళీగా ఉంచారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్‌బీఐ నుంచి ఇబ్బందులు వస్తాయని భావిస్తే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగానైనా తీర్చిదిద్దవచ్చు. అధికారులు కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు. ఇప్పటికైనా వెంటనే కేడీసీసీ అధికారులు నూతన భవనాన్ని అద్దెకు ఇచ్చే అంశంపై త్వరగా నిర్ణయ తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అద్దాల మేడ అలంకారమేనా..?
Published Thu, Feb 26 2015 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement