తెలుగు యువత కన్వీనర్‌గా వీరేందర్ గౌడ్ | veerendar goud selected as telugu youth convenor | Sakshi
Sakshi News home page

తెలుగు యువత కన్వీనర్‌గా వీరేందర్ గౌడ్

Published Mon, Feb 9 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

veerendar goud selected as telugu youth convenor

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా పార్టీ నేత, ఎంపీ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభా స్థానం నుంచి వీరేందర్ గౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలిచిన తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఇటీవలే వీరేందర్ గౌడ్‌ను ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా  చంద్రబాబు నియమించారు.మేలో జరిగే మహానాడు తరువాత ఆయననే యువత విభాగానికి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా నియమించనున్నారు. తెలుగు మహిళా విభాగం తెలంగాణ కన్వీనర్‌గా నల్లగొండకు చెందిన బండ్రు శోభారాణి నియమితులయ్యారు. వీరితో పాటు మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జిగా బక్కి వెంకటయ్య, సంగారెడ్డి ఇన్‌చార్జిగా మాణిక్యంలను నియమించారు. టీడీపీ తెలంగాణ మీడియా ప్రతినిధులుగా ప్రతాప్‌రెడ్డి, రాజారాం యాదవ్, కాశీనాథ్, బుచ్చిలింగం, సతీశ్‌మాదిగ, వి.కె. మహేష్, లక్ష్మణ్ నాయక్, రజని కుమారిలను నియమించారు
 తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎంపికపై మల్లగుల్లాలు: ప్రస్తుతం పార్టీకి కరీంనగర్‌కు చెందిన మాజీ మంత్రి ఎల్. రమణ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా, అది తాత్కాలిక ఏర్పాటుగానే ఉంది. పార్టీ నేతలంతా టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. దీనికోసం కసరత్తు జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement
Advertisement