
మృతదేహాలతో శాంతినగర్‌లో ధర్నా చేస్తున్న రామాపురం గ్రామస్తులు
అలంపూర్: ఓ శుభకార్యం కోసం వెళ్లి వస్తూ.. ఊహించని రోడ్డు ప్రమాదంలో విగత జీవులై తిరిగొచ్చిన తమ వాళ్లను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఊరంతా కదిలొచ్చి వెల్దుర్తి రోడ్డు ప్రమాద మృతులకు కడసారి వీడ్కోలు పలికారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 16 మందిలో 15 మంది జోగుళాంబ గద్వాల జిల్లా వాసులే. వీరిలో 14 మంది వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామస్తులే ఉండటంతో భౌతిక కాయాలను ఒకే చోట ఖననం చేశారు. ఆదివారం వీటి కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేసింది. రామాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మన్న కుమారుడు శ్రీనాథ్ వివాహం నిశ్చయం చేసుకుని అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి తిరిగి వస్తుండగా.. కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు.
శాంతినగర్‌లో ధర్నా
మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌ను ఆదివారం శాంతినగర్ వద్ద నిలిపివేసి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, పిల్లలకు విద్య సౌకర్యం, రైతు బీమాతో పాటు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించాలని ఎమ్మెల్యే అబ్రహంను ఘెరావ్ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీలపై స్పష్టమైన ప్రకటన చేయడం వీలుపడదని, బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని గద్వాల ఆర్డీఓ రాములు హామీనివ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాతో అలంపూర్–రాయిచూరు రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. ఎస్పీ లక్ష్మినాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్ హుసేన్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసి మృతదేహాలు ఉన్న అంబులెన్స్‌లను అక్కడి నుంచి తరలించారు.
ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు..
జోగుళాంబ గద్వాల కలెక్టర్ శశాంక ఆదేశాల మేర కు రామాపురం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో ఒక ఎకరం పొలం ఎంపిక చేసి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహాలను వారి నివాసాలకు కాకుం డా ప్రత్యేకంగా వేసిన టెంట్ల వద్దకు చేర్చారు. అక్కడే అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసి కొత్తగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలో ఖననం చేశారు. అంత్యక్రియల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు. బాధిత కుటుం బాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రులు డీకే అరు ణ, రాములు, ఢిల్లీలో ప్రభుత్వ అధికారి ప్రతినిధి మందా జగన్నాథం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీజే పీ అభ్యర్థి బంగారు శ్రుతి పరామర్శించారు.

ప్రత్యేక శ్మశాన వాటికలో మృతదేహాల ఖననం
Comments
Please login to add a commentAdd a comment