సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో విజయ పాల విక్రయాలు భారీగా పడిపోయాయి. ఏడాది కింద విక్రయాలు 3.80 లక్షల లీటర్లుకాగా.. ఇప్పుడు 2.30 లక్షల లీటర్లకు తగ్గిపోయాయి. ఏకంగా లక్షన్నర లీటర్లు (సుమారు 40 శాతం) తగ్గిపోవడం గమనార్హం. దీంతో సంస్థ టర్నోవర్‌లో రూ.240 కోట్లు తగ్గిందని విజయ డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి 3.80 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకు పాల విక్రయాలను పెంచుతామంటూ విజయ డెయిరీ అధికార యంత్రంగా సంస్కరణలకు తెరలేపింది. కానీ ఉన్న విక్రయాలే తగ్గిపోతు న్నాయని.. చివరికి డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయని సంస్థ ఉద్యోగులే ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. తగ్గిన లక్షన్నర లీటర్ల విక్రయాలను తిరిగి పూడ్చుకోవడం అంత సులువైన విషయం కాదని పేర్కొంటున్నారు.
ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో..
దాదాపు 40 ఏళ్లుగా విజయ డెయిరీ నుంచి వినియోగదా రులకు పాల సరఫరా, బిల్లులు వసూళ్లను ఏజెంట్లే చేసిపెడుతున్నారు. తద్వారా వచ్చే కమీషన్‌తో జీవనం సాగిస్తు న్నారు. ఒక్కో ఏజెంటు నెలకు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. ఇక రాష్ట్రంలో విజయ డెయిరీకి ఎక్కువగా పాల విక్రయాలు హైదరాబాద్‌లోనే జరుగుతుంటా యి. ఇక్కడ 1,650 మంది ఏజెంట్లు పాలను సరఫరా చేస్తుండేవారు. కానీ విజయ డెయిరీ అధికార యంత్రాంగం వెనుకా ముందు ఆలోచించకుండా ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసింది. వారి స్థానంలో 112 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగ దారుల సమస్యలు పరిష్కరించడం కోసం హైదరాబాద్‌లో 18 జోన్ కార్యాలయాలు ఉండేవని, వాటిని రద్దు చేశారని డెయిరీ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా డిస్ట్రిబ్యూట ర్ల చేతుల్లోనే పాల విక్రయాలు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక గతంలో ఏజెంట్లకు లీటరు పాలకు రూ.2.50 చొప్పున కమీషన్‌గా ఇచ్చేవారు. రవాణాకు అయ్యే ఖర్చు కింద డెయిరీ 70 పైసలు చెల్లించేది. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్‌ను ఏకంగా రూ.3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు.
అడ్వాన్స్ కార్డులూ డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే..
విజయ పాల కొనుగోలు కోసం వినియోగదారులకు అందజేసే అడ్వాన్స్ కార్డులను అక్టోబర్ నుంచి రద్దు చేయాలని విజయ డెయిరీ భావించింది. కానీ దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. అడ్వాన్స్ కార్డుల ద్వారా విజయ డెయిరీకి నికరంగా 1.30 లక్షల లీటర్ల విక్రయాలు జరిగేవి. ముందస్తుగానే రూ.18 కోట్ల సొమ్ము జమ అయ్యేది. పైగా వినియోగదారులకు లీటరుకు రూ.1.20 రాయితీ వచ్చేది. ఇప్పుడు అడ్వాన్స్ కార్డులను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించి ఆ రాయితీని 60 పైసలకు కుదించారు. పైగా గతంలో అడ్వాన్స్ కార్డులను విజయ డెయిరీ నేరుగా ఈ–సేవ, టీఎస్ ఆన్‌లైన్ ద్వారా అందజేసేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే పెట్టడంతో అడ్వాన్స్ సొమ్ము రూ.18 కోట్లు ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి వెళ్లినట్లయింది. పైగా అడ్వాన్స్ కార్డులు ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. కార్డులు ఇచ్చామని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు రాయితీని మింగేసే అవకాశముందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తంగా విజయ డెయిరీ ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోకి వెళ్లిపోతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పైగా కీలక ప్రజాప్రతినిధులు తమ అనుచరులైన కొందరు డిస్ట్రిబ్యూటర్లను నియమించుకున్నారని.. దీంతో పెత్తనం పెరిగి విజయ డెయిరీని దెబ్బతీస్తుందన్న సందేహాలు వస్తున్నాయి.
పాల విక్రయాలు తగ్గిన మాట వాస్తవమే..
‘‘ఇటీవల విజయ డెయిరీ పాల విక్రయాలు తగ్గిపోయిన మాట వాస్తవమే. ఇది తాత్కాలికమే. విజయ డెయిరీని గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేయక తప్పడం లేదు. ఇందులో భాగంగానే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనివల్ల విజయ డెయిరీ విస్తరిస్తుంది. ఇలాంటి విషయాలపై కాస్త వ్యతిరేకత రావడం సహజమే..’’
– సురేశ్ చందా, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment