
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాలు సరఫరా చేసేందుకు డెలివరీ బాయ్స్ ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో స్విగ్గీ, బిగ్ బాస్కెట్ లాంటి డోర్ డెలివరీ సంస్థల ద్వారా అవసరమైన మేరకు పాలు ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ప్రజలు పాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీల యాజమాన్యాలతో పాలు, సంబంధిత ఉత్పత్తుల సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో అన్ని డెయిరీలవి కలిపి రోజుకు దాదాపు 68 లక్షల లీటర్ల పాలను ప్రజలు వినియోగిస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 64 లక్షల లీటర్లకు పడిపోయిందని విజయా డెయిరీ ఎండీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే రోజుకు 30 లక్షల లీటర్లు సరఫరా అయ్యేవని, ఇప్పుడు అది 27 లక్షలకు పడిపోయిందని చెప్పారు. ఇందుకు పాల సరఫరా కోసం సిబ్బంది ముందుకు రాకపోవడమే కారణమని వివరించారు. దీనికి మంత్రి స్పందిస్తూ నిత్యావసరాలైన పాలు, పాల పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. పాల ఉత్పత్తులను కేవలం ఉదయం 5 నుండి 9 గంటలలోపే సరఫరా చేసేందుకు పోలీసులు అనుమతించడంతో ఇబ్బందులు వస్తున్నాయని, సాయంత్రం 5 గంటల వరకు రిటైల్ ఔట్‌లెట్‌ల ద్వారా పాల సరఫరా జరిగేలా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని డెయిరీ నిర్వాహకులకు మంత్రి హామీ ఇచ్చారు.
పరిస్థితు లను ఆసరాగా చేసుకుని రిటైల్ వ్యాపారులు కొందరు ధరలు పెంచి పాలను విక్రయిస్తున్నారని ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్పత్తుల ప్యాకెట్లపై తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలను ముద్రించాలని ఆదేశించారు. పాల సరఫరా, పంపిణీలో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ (040–23450624)కు ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.