
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది బోనాల పండుగను ప్రజలం తా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శ్రీజగదాంబ అమ్మవారు, శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజ ఉమ్మడి దేవాలయాల్లో సాంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు, అలంకరణ, బోనం చేయాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం తలసాని అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కమిటీ సభ్యుల సలహాల మేరకు ఈ ఏడాది బోనాలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. బోనాల పండుగ జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, అందువల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామూహికంగా జరుపుకోవడం మంచిది కాదని చెప్పారు. నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించిందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు నాయిని నరసింహారెడ్డి, ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పోలీ సు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, దేవాదాయశాఖ కమిషనర్లు లోకేశ్, అనిల్‌కుమార్, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.