గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. చిత్రంలో అంజన్‌కుమార్ యాదవ్
సాక్షి, ఉస్మానియా ఆస్పత్రి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంటే ప్రభుత్వం చేతులెత్తేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు ఉస్మా నియా ఆస్పత్రి వర్షపు నీటిలో మునిగిపోవ టమే నిదర్శనమన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ వచ్చాక వరద నీటితో నింపటమే టీఆర్‌ఎస్ సర్కారు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. బుధవారం కురిసిన భారీ వర్షంతో ఆస్పత్రి వార్డుల్లోకి నీళ్లు చేరిన విష యం తెలిసిందే. రెండోరోజు కూడా ఆస్పత్రిలో ఇబ్బందులు తప్పలేదు. వర్షపు నీటిలో ఉన్న పడకలను ఇతర గదులకు మార్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉత్తమ్ ఆధ్వర్యంలోని బృందం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిం చింది. నీట మునిగిన వార్డులను పరిశీలించింది. రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంది.
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఖరి వల్లే హైదరాబాద్ నగరం కరోనాతో విలవిల్లాడుతోందని ఆరోపించారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా పరీక్షలు నిర్వహించట్లేదని, పాజిటివ్ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం స్వల్పంగా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌కు ఏ అధికారం లేదని, ఆయనను కేవలం రబ్బర్‌స్టాంప్‌గా వాడుకుంటున్నారన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణేదీ?
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఫీజుల మోతతో పాటు పేదలు వెళ్తే బెడ్లు ఇవ్వని పరిస్థితి ఉందని, ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని ఉత్తమ్ అన్నారు. ఇక వాన నీటిలో మునిగిన పడకలతో ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను వదిలేసి ఫాంహౌస్‌లో కాలయాపన చేస్తుండటం దురదృష్టకరమన్నారు. అసమర్థత, ముందుచూపు లేకపోవటం వల్లే హైదరాబాద్ గజగజలాడుతోందన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు సీఎం తన మూఢనమ్మకాలతో సెక్రటేరియట్ కూలగొడుతుండటం దారుణమన్నారు. ఇందుకోసం వెచ్చించే నిధులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రి బాగుకు కేటాయించాలని ఉత్తమ్ కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, నాయకులు ఫిరోజ్‌ఖాన్, గౌస్ తదితరులున్నారు.
ఆయుష్మాన్ భారత్‌లో చేరండి : బండి సంజయ్
వర్షపు నీరు ముంచెత్తిన ఉస్మానియా ఆస్పత్రిని గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించారు. పీపీఈ కిట్ ధరించిన ఆయన ఆస్పత్రిలోని అన్ని ప్రాంతాలు పరిశీలించారు. తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉస్మానియా ఆసుపత్రిలో పేదలకు సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి కనీస వసతులు లేవు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదు?. ఆయుష్మాన్ భారత్ అమలు చేయట్లేదు. కరోనా నియంత్రణలో సీఎం పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా వైఫల్యాన్ని ఒప్పుకుని ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలి. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంపై కోర్టులో కేసు ఉందని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరి సచివాలయం విషయంలో కోర్టు కేసు లేదా?. ప్రస్తుతం అవసరం లేని సెక్రటేరియట్ కూల్చివేత, నిర్మాణాలు ఆపి ఉస్మానియా ఆస్పత్రిని ఆధునీకరించాలి’ అని సంజయ్ అన్నారు. ఆయన వెంట ఎంఎల్‌సీ రాంచందర్‌రావు, ఎంఎల్‌ఏ రాజాసింగ్ ఉన్నారు.
కొత్త భవనం నిర్మించండి: చెరుకు
సీఎం కేసీఆర్‌కు సచివాలయం కూల్చివేయడంపై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రిపై లేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గురువారం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమైఖ్య రాష్ట్రంలో విడుదల చేసిన రూ.200 కోట్లను ఇప్పటికీ వినియోగించుకోలేదన్నారు. కేసీఆర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
నాడు మీరు చేసిందేమిటి: తలసాని
పాత ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం కట్టేందుకు ముఖ్యమంత్రి నిర్ణయిస్తే..హెరిటేజ్ భవనం ఎలా కూలుస్తారంటూ అడ్డుకున్నది కాంగ్రెస్, బీజేపీలేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారని గుర్తుచేశారు. మొత్తం 11 బ్లాకుల్లో 8 బ్లాక్‌ల పరిస్థితి అధ్వానంగా మారినట్టు అధికారులిచ్చిన నివేదిక మేరకు కొత్త ఆస్పత్రి నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం హెరిటేజ్ జాబితాలో ఉందని, కూల్చివేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించారని తలసాని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ్, వీహెచ్‌లు అడ్డుకున్న వీడియోలను మంత్రి తలసాని ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment