సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల హీట్ పెరిగింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎటు చూసినా ముందస్తు ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ముందస్తుకు తేదీ ఖరారు చేయాలని ఆదివారం సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య ముందుస్తు వార్ నడుస్తోంది. ఎన్నికలపై మేం రెడీ మీదే ఆలస్యం అంటోంది బీజేపీ. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికల విషయంలో దూకుడు పెంచింది. ఒకరిపై ఒకరు సవాళ్లతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
మేం రెడీ: బండి సంజయ్
సీఎం కేసీఆర్‌స వాల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వీకరించారు. ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌లో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని, కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టే అవసరం తమకు లేదన్నారు. టీఆర్‌ఎస్ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని కేసీఆర్ తెరమీదకు తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఆదివారం నాటి ప్రెస్‌మీట్‌లో కనిపించిన కేసీఆర్ ముఖంలోని భయాన్ని ప్రజలందరూ గమనించారని ఎద్దేవా చేశారు.
ధరణి పోర్టల్‌ను నిరసిస్తూ సోమవారం కరీంనగర్‌లో బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏం చేసినా ఆయన కుటుంబం బాగు పడటానికి మాత్రమేనని మండిపడ్డారు. ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి గందరగోళం సృష్టించారని, 15 లక్షల ఎకరాలు ధరణి పోర్టర్‌లో ఇంతవరకూ ఎంట్రీ కాలేదని తెలిపారు. 50 శాతం ప్రక్రియ కూడా పూర్తి కాలేదని, వెంటనే ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అంసెబ్లీని రద్దు చేయ్
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు సవాల్ చేయడం కాదు.. ముందు అసెంబ్లీ రద్దు చేయ్ అంటూ సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని శాసనసభ రద్దయితే ఆటోమెటిక్‌గా ఎన్నికలు వస్తాయని, ఎన్నికలకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. తెలంగాణకు నరేంద్రమోదీ, కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.. రాష్ట్రంలో నీళ్లు వచ్చే ప్రాజెక్టులు కాంగ్రెస్ నిర్మిస్తే.. పైసలు వచ్చే ప్రాజెక్టులు కేసీఆర్ చేపట్టారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment