కరీంనగర్‌టౌన్/ఎల్కతుర్తి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్‌కు కోవర్టులున్నారని, గత ఎన్నికల్లో ఆయన వారికి పెద్దఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు.
ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఆ నిందను బీజేపీపైకి నెట్టివేసినా ఆశ్చర్యం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్‌లో బండి సంజయ్ సమక్షంలో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని, పంచొద్దని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ‘భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు నిధులిస్తామని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్’అని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయారని, బయటికి వస్తే ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఢిల్లీలో ఉండాల్సింది మోదీనే అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం..
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి కాంగ్రెస్ నేతలను చూస్తే జాలేస్తుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్‌ఎస్‌ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచి్చన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు.
అయోధ్యపై రగడ ఎందుకు?
అయోధ్య రామమందిర ఉత్సవం రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమమని, దీనిపై రగడ ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ లు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పా లన్నారు. ఒకనాడు కాంగ్రెసోళ్లు అయోధ్యలోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. కానీ దేశ ప్రజలు ప్రశాతంగా ఉంటూ కోర్టు తీర్పును స్వాగతించే సరికి జీరి్ణంచుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.
చిల్లర రాజకీయాలు మానుకోవాలి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హితవు పలికారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు ఎంత అహకారం ఉందో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా అంతే అహంకారం ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకుల మాటలనే పొన్నం ప్రభాకర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని నిందిస్తే పొన్నంకు ఏమి వస్తుందో అర్థం కావడం లేదన్నారు.
అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రజలు మనల్ని చూసి గర్వపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. రాబోయో ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ మిత్రుడు అడగడంతో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ఎంతమంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే అంత ఎక్కువగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment