కరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రభుత్వాన్ని కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం.. మమ్మల్ని ముట్టుకొనే దమ్ముందా, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు.. మా పార్టీలో కోవర్ట్ వ్యవస్థ లేదు, మా 64 మంది కుటుంబ సభ్యులమంతా కలిసే ఉన్నాం, నోరు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి’అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్‌ని హెచ్చరించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ కూలుస్తుందని బండి సంజయ్ చెప్పడంపై స్పందిస్తూ.. ఆయన జోస్యం చెబుతున్నారా, లేదంటే బీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని తాము చెప్పిందే నిజమని దీనితో రుజువైందన్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న సంజయ్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. తాము దేశ నిర్మాణం చేసినవారిమని, విధ్వంసాలు సృష్టించే పని తమకెందుని అన్నారు. ఇవి మతిలేని వ్యాఖ్యలని ధ్వజమెత్తారు. తాము జీవితంలో బీజేపీతో కలిసేది లేదని, రెండు పార్టీల దారులు వేరని స్పష్టం చేశారు. ఇంటర్మిడియెట్ ఫెయిల్ అయిన బండి సంజయ్ జోస్యాలు చెపుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు.
పర్మినెంట్‌గా ‘కేసీఆర్’లానే ఉండండి..
‘మీ నాయనకు సీఎం పదవి అనేది ఎడం కాలు చెప్పు అయింది. నీకు కూడా ఆ అక్షరాలు నచ్చట్లేదు.. పర్మినెంట్‌గా కేసీఆర్‌లానే ఉండండి. జీవితంలో సీఎం అనే పదవి తీసుకోకండి. సీఎం అనే పదమే మీకు పడదు. ఆ పదవి దిక్కే రాకండి. చాలా సంతోషం’అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి పొన్నం వ్యాఖ్యానించారు. సీఎం పదవి కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్‌ఫుల్ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోతామని కేటీఆర్ కలలో కూడా ఊహించలేదని, అందుకే అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు.
అయోధ్యలో ఎన్నికల మార్కెటింగ్
అయోధ్యలో ధర్మానికి విరుద్ధంగా ఎన్నికల మార్కె టింగ్ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే విషయం మాట్లాడితే హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారన్నా రు. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట ఎవరు చేయాలో హిందువులందరికి తెలుసని, జంటగా లేనటువంటి వారెలా చేస్తారని ప్రశ్నించారు. ఆలయం నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంబోత్సవమేమిటన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment