door deliver boys
-
ఆన్లైన్లో పాల సరఫరా
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాలు సరఫరా చేసేందుకు డెలివరీ బాయ్స్ ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో స్విగ్గీ, బిగ్ బాస్కెట్ లాంటి డోర్ డెలివరీ సంస్థల ద్వారా అవసరమైన మేరకు పాలు ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ప్రజలు పాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం ఆయన రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీల యాజమాన్యాలతో పాలు, సంబంధిత ఉత్పత్తుల సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో అన్ని డెయిరీలవి కలిపి రోజుకు దాదాపు 68 లక్షల లీటర్ల పాలను ప్రజలు వినియోగిస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 64 లక్షల లీటర్లకు పడిపోయిందని విజయా డెయిరీ ఎండీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే రోజుకు 30 లక్షల లీటర్లు సరఫరా అయ్యేవని, ఇప్పుడు అది 27 లక్షలకు పడిపోయిందని చెప్పారు. ఇందుకు పాల సరఫరా కోసం సిబ్బంది ముందుకు రాకపోవడమే కారణమని వివరించారు. దీనికి మంత్రి స్పందిస్తూ నిత్యావసరాలైన పాలు, పాల పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. పాల ఉత్పత్తులను కేవలం ఉదయం 5 నుండి 9 గంటలలోపే సరఫరా చేసేందుకు పోలీసులు అనుమతించడంతో ఇబ్బందులు వస్తున్నాయని, సాయంత్రం 5 గంటల వరకు రిటైల్ ఔట్లెట్ల ద్వారా పాల సరఫరా జరిగేలా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని డెయిరీ నిర్వాహకులకు మంత్రి హామీ ఇచ్చారు. పరిస్థితు లను ఆసరాగా చేసుకుని రిటైల్ వ్యాపారులు కొందరు ధరలు పెంచి పాలను విక్రయిస్తున్నారని ప్రజలు తమకు ఫిర్యాదు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్పత్తుల ప్యాకెట్లపై తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలను ముద్రించాలని ఆదేశించారు. పాల సరఫరా, పంపిణీలో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ (040–23450624)కు ఫిర్యాదు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. -
గుది‘బండ’
సాక్షి, కర్నూలు: ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర చుక్కలు చూపుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కట్టెల పొయ్యి పెట్టుకోవడం మేలనుకునే పరిస్థితి నెలకొంది. ఆధార్‌తో అనుసంధానం నేపథ్యంలో సిలిండర్‌కు సంబంధించి మొత్తం డబ్బును మొదట వినియోగదారుడే చెల్లించాల్సి ఉండగా.. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం వారి అకౌంట్లలో జమ అవుతుందని ప్రభుత్వం చెప్పడం గందరగోళానికి తావిస్తోంది. ఇది జిల్లాలో ఇంకా అమలు కాకపోయినా.. ప్రజల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో డోర్ డెలివరీ బాయ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీకి తెర తీశారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాల్సిన గ్యాస్ ఏజెన్సీలు మద్దతిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సిలిండర్ ఇంటికి చేరడమే మహాభాగ్యం అన్నట్లు కొందరు వినియోగదారులు అడిగిన మేరకు డబ్బు ముట్టజెబుతూ మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా బాయ్స్ దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లాలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలకు చెందిన 47 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఐదు లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారందరికీ 72 గంటల్లోగా సిలిండర్లను అందజేయాల్సి ఉంది. బుక్ చేసుకున్న వినియోగదారులకు వరుస క్రమంలో ఏజెన్సీలు సిలిండర్‌ను అందజేస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయిల్ సంస్థలు వినియోగదారుడికి అందించే బిల్లులను సైతం పూర్తి వివరాలతో పారదర్శకంగా అందిస్తున్నాయి. వినియోగదారుడి వరుస క్రమం ప్రకారం అతనికి సిలిండర్ ఇవ్వాల్సిన వంతు రాగానే నేరుగా ఆన్లైన్లోనే బిల్లు కూడా సిద్ధమవుతుంది. దేశీయంగా సిలిండర్ ధర ఆ రోజు ఎలా ఉందో దాని ప్రకారమే బిల్లు సిద్ధం చేస్తున్నారు. అయితే జిల్లాలోని చాలా ఏజెన్సీలు డెలివరీ సమయంలో బిల్లుపై అదనంగా వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా డోర్ డెలివరీ బాయ్స్ ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో తరచూ వినియోగదారులు గొడవకు దిగాల్సి వస్తోంది. దోపిడీ జరుగుతోందిలా.. కర్నూలులోని సి.క్యాంప్‌నకు చెందిన గ్యాస్ వినియోగదారుడు గత నెల 27న ఆన్లైన్లో సిలిండర్ బుక్ చేసుకున్నాడు. ఈ నెల 4న అతని సిలిండర్‌కు సంబంధించిన క్యాష్ బిల్లు సిద్ధమైంది. ఆ రోజు ధరను రూ.415లుగా ఆ బిల్లులో పేర్కొన్నారు. అయితే వినియోగదారుడికి మాత్రం 5వ తేదీన గ్యాస్ సిలిండర్ అందింది. సిలిండర్ బిల్లుపై ఉన్న ధరకు అదనంగా రూ.15లను డెలివరీ బాయ్ డిమాండ్ చేయడంతో సదరు వినియోగదారుడు ఇదేమని ప్రశ్నించాడు. అందుకు డెలివరీ బాయ్ ‘ఈ రోజు సిలిండర్ ధర ఇంతే’నని సమాధానమివ్వడం అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు రూ.15 నుంచి రూ.40 వరకు ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు మండిపడుతున్నారు.