సాక్షి, కర్నూలు: ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర చుక్కలు చూపుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కట్టెల పొయ్యి పెట్టుకోవడం మేలనుకునే పరిస్థితి నెలకొంది. ఆధార్‌తో అనుసంధానం నేపథ్యంలో సిలిండర్‌కు సంబంధించి మొత్తం డబ్బును మొదట వినియోగదారుడే చెల్లించాల్సి ఉండగా.. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం వారి అకౌంట్లలో జమ అవుతుందని ప్రభుత్వం చెప్పడం గందరగోళానికి తావిస్తోంది. ఇది జిల్లాలో ఇంకా అమలు కాకపోయినా.. ప్రజల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో డోర్ డెలివరీ బాయ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోపిడీకి తెర తీశారు.
ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాల్సిన గ్యాస్ ఏజెన్సీలు మద్దతిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సిలిండర్ ఇంటికి చేరడమే మహాభాగ్యం అన్నట్లు కొందరు వినియోగదారులు అడిగిన మేరకు డబ్బు ముట్టజెబుతూ మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా బాయ్స్ దోపిడీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జిల్లాలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ ఆయిల్ కంపెనీలకు చెందిన 47 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఐదు లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారందరికీ 72 గంటల్లోగా సిలిండర్లను అందజేయాల్సి ఉంది.
బుక్ చేసుకున్న వినియోగదారులకు వరుస క్రమంలో ఏజెన్సీలు సిలిండర్‌ను అందజేస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయిల్ సంస్థలు వినియోగదారుడికి అందించే బిల్లులను సైతం పూర్తి వివరాలతో పారదర్శకంగా అందిస్తున్నాయి. వినియోగదారుడి వరుస క్రమం ప్రకారం అతనికి సిలిండర్ ఇవ్వాల్సిన వంతు రాగానే నేరుగా ఆన్‌లైన్‌లోనే బిల్లు కూడా సిద్ధమవుతుంది. దేశీయంగా సిలిండర్ ధర ఆ రోజు ఎలా ఉందో దాని ప్రకారమే బిల్లు సిద్ధం చేస్తున్నారు. అయితే జిల్లాలోని చాలా ఏజెన్సీలు డెలివరీ సమయంలో బిల్లుపై అదనంగా వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా డోర్ డెలివరీ బాయ్స్ ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో తరచూ వినియోగదారులు గొడవకు దిగాల్సి వస్తోంది.
దోపిడీ జరుగుతోందిలా..
కర్నూలులోని సి.క్యాంప్‌నకు చెందిన గ్యాస్ వినియోగదారుడు గత నెల 27న ఆన్‌లైన్‌లో సిలిండర్ బుక్ చేసుకున్నాడు. ఈ నెల 4న అతని సిలిండర్‌కు సంబంధించిన క్యాష్ బిల్లు సిద్ధమైంది. ఆ రోజు ధరను రూ.415లుగా ఆ బిల్లులో పేర్కొన్నారు. అయితే వినియోగదారుడికి మాత్రం 5వ తేదీన గ్యాస్ సిలిండర్ అందింది. సిలిండర్ బిల్లుపై ఉన్న ధరకు అదనంగా రూ.15లను డెలివరీ బాయ్ డిమాండ్ చేయడంతో సదరు వినియోగదారుడు ఇదేమని ప్రశ్నించాడు. అందుకు డెలివరీ బాయ్ ‘ఈ రోజు సిలిండర్ ధర ఇంతే’నని సమాధానమివ్వడం అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు రూ.15 నుంచి రూ.40 వరకు ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు మండిపడుతున్నారు.
గుది‘బండ’
Published Thu, Oct 17 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement