కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: నూతన సంవత్సర ఆరంభ వేడుకల్లో మునిగి ఉన్న ప్రజలపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. గ్యాస్ సిలిండర్ ధర రూ.30కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్య జనంపై అదనపు భారాన్ని మోపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు పెట్రోల్, మరోవైపు డీజిల్ ధరలను అడ్డుగోలుగా పెంచుతున్న కేంద్రం ఈసారి వినియోగదారుల నడ్డి విరిగే విధంగా గ్యాస్ ధరలను పెంచడంపై నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో దీపం, డబుల్ సిలిండర్ తదితర గ్యాస్ కనెక్షన్లు 5.50 లక్షలు ఉన్నాయి. వినియోగదారులకు 48 మంది డీలర్లు గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా సబ్సిడీపై దాదాపు 3 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ ఖచ్చితమైన ధర రూ.410 ఉండగా, దీనిని కేంద్రం రూ.440కి పెంచింది.
అంటే ప్రతినెలా వినియోగదారులపై దాదాపు రూ.కోటి భారం పడుతుంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు వంట గ్యాస్ ధరను పెంచడంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ వినియోగదారులకు ఈ నెల నుంచే నగదు బదిలీ పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలో 50 శాతం మందికి కూడా ఆధార్ కార్డులు రాలేదు.
బ్యాంకు ఖాతాలు రెండు లక్షల మందికి మాత్రమే ఉన్నాయి. ఆధార్ లేకపోతే వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి వస్తోంది. గ్యాస్ వినియోగదారులను ఒకవైపు ఆధార్, మరోవైపు ధరలు పెంచడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వంట గ్యాస్ పెంపుపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వంట గ్యాస్ ధరలు పెంచడం దారుణమని, ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరువెంకటరెడ్డి తెలిపారు. పెంచిన ధరలను తగ్గించేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
గ్యాస్ గుదిబండ
Published Thu, Jan 2 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement