నూతన సర్పంచ్‌లు గళం విప్పేనా? | Village Sarpanches Meeting In Koheda | Sakshi
Sakshi News home page

నూతన సర్పంచ్‌లు గళం విప్పేనా?

Published Thu, Apr 4 2019 6:50 PM | Last Updated on Thu, Apr 4 2019 6:51 PM

Village Sarpanches Meeting In Koheda - Sakshi

గతంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశ దృశం (ఫైల్‌) 

సాక్షి, కోహెడరూరల్‌ (హుస్నాబాద్‌): ఇన్నాళ్లు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో నిధులు సరిగ్గా లేక అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేక పంచాయతీల్లో ఆశించిన మేర అభివృద్ధి కానరాలేదు. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం. అధికారులు సక్రమంగా విధుల్లో ఉండటంతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు సర్వసభ్య సమావేశం ఆసెంబ్లీ లాంటిది. గురువారం మండలంలో సర్వసభ్య సమావేశం తొలిసారిగా హారజరవుతున్న నూతన సర్పంచ్‌లు గ్రామాల సమస్యలపై తమ గళం విప్పుతారో లేదో చూడాలి.


నూతన సర్పంచులకు తొలివేదిక...
మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులకు నేడు జరిగే మండల సర్వసభ్య సమావే«శం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కారమార్గానికి మండల సర్వసభ్య సమావేశం అనుభవంగా మారనుంది. మండలంలో 27 గ్రామాల సర్పంచ్‌ల సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు అవకాశం ఉంటుంది. నేడు మండల పరిషత్‌ మందిరంలో ఎంపీపీ ఉప్పుల స్వామి ఆధ్వర్యంలో 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ దేవేందర్‌రాజు తెలిపారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.


ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం...
నేడు జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరు కాగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఎంపీటీసీల  స్థానాలు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయగా త్వరలో ఎన్నికలు నిర్వహించకుంటే మరో సర్వసభ్య సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కర వేదికగా జరిగే ఈ సమావేశంలో సర్పంచ్‌లు సమస్యలపై ప్రస్తావిస్తారో లేదో చూడాలి. రెండు నెలల క్రితం నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన రావాలి. సమస్యల పరిష్కారానికి గళం విప్పి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 


చర్చకు రానున్న 19 అంశాలు...
నేడు జరిగే సర్వసభ సమావేశంలో 19 అంశాలు ప్రధానంగా చర్చించుటకు సభాధ్యక్షుడి అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖ, గ్రామీణ విద్యుత్, వైద్య ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధి హమీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రవాణాéశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్‌ కాకతీయ, వసతి గృహ, రోడ్డు భవనాల శాఖ వంటి  శాఖలకు సంబంధించిన అంశాలు సభలో చర్చకు వస్తాయి. మండలంలో ఎక్కువగా వ్యవసాయం పై ఆదారపడి జీవిస్తున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి.

వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయంలో సలహలు, సూచనలు ఇస్తున్నారా లేదా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా తదితర అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధిహమీ పథకంలో భాగంగా మండలంలో కూలీలకు పని కల్పిస్తున్నారా, కూలీల పని దినాలు, క్షేత్ర స్థాయిలో  ఉపాధిహమీ ద్వారా అధికారులు రైతులకు ఉపయోగపడే పనులు చేయిస్తున్నారా? పశుపొషణ ద్వారా పాడి గేదెలు, బర్రెల పెంపకం, వివిధ శాఖలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏన్‌ఏంలు సక్రమంగా ఉంటున్నారా? అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భినులకు పౌష్టికహరం అందుతుందా లేదా రేషన్‌ పరఫరా చేస్తున్నారా వంటి వివిధ అంశాలపై నూతన సర్పంచ్‌లు చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తేనే పరిష్కారానికి నోచుకునే విలుంటుంది. ఈ నేపధ్యంలో మండలంలో జరిగే సర్వసభ్య సమావేశంలో నూతన  సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్న సందర్భంగా సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకోంటారో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement