Sarpanch candidates
-
ఈ పిటిషన్లో జోక్యం చేసుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాలకు సంబంధించి ఏపీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్టికల్ 131 చెల్లుబాటుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. -
నూతన సర్పంచ్‌లు గళం విప్పేనా?
సాక్షి, కోహెడరూరల్ (హుస్నాబాద్): ఇన్నాళ్లు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో నిధులు సరిగ్గా లేక అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేక పంచాయతీల్లో ఆశించిన మేర అభివృద్ధి కానరాలేదు. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం. అధికారులు సక్రమంగా విధుల్లో ఉండటంతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు సర్వసభ్య సమావేశం ఆసెంబ్లీ లాంటిది. గురువారం మండలంలో సర్వసభ్య సమావేశం తొలిసారిగా హారజరవుతున్న నూతన సర్పంచ్‌లు గ్రామాల సమస్యలపై తమ గళం విప్పుతారో లేదో చూడాలి. నూతన సర్పంచులకు తొలివేదిక... మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులకు నేడు జరిగే మండల సర్వసభ్య సమావే«శం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కారమార్గానికి మండల సర్వసభ్య సమావేశం అనుభవంగా మారనుంది. మండలంలో 27 గ్రామాల సర్పంచ్ల సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు అవకాశం ఉంటుంది. నేడు మండల పరిషత్ మందిరంలో ఎంపీపీ ఉప్పుల స్వామి ఆధ్వర్యంలో 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ దేవేందర్‌రాజు తెలిపారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం... నేడు జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరు కాగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఎంపీటీసీల స్థానాలు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయగా త్వరలో ఎన్నికలు నిర్వహించకుంటే మరో సర్వసభ్య సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. సమస్యల పరిష్కర వేదికగా జరిగే ఈ సమావేశంలో సర్పంచ్‌లు సమస్యలపై ప్రస్తావిస్తారో లేదో చూడాలి. రెండు నెలల క్రితం నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన రావాలి. సమస్యల పరిష్కారానికి గళం విప్పి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చకు రానున్న 19 అంశాలు... నేడు జరిగే సర్వసభ సమావేశంలో 19 అంశాలు ప్రధానంగా చర్చించుటకు సభాధ్యక్షుడి అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖ, గ్రామీణ విద్యుత్, వైద్య ఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధి హమీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రవాణాéశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్ కాకతీయ, వసతి గృహ, రోడ్డు భవనాల శాఖ వంటి శాఖలకు సంబంధించిన అంశాలు సభలో చర్చకు వస్తాయి. మండలంలో ఎక్కువగా వ్యవసాయం పై ఆదారపడి జీవిస్తున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ అధికారులు రైతులకు వ్యవసాయంలో సలహలు, సూచనలు ఇస్తున్నారా లేదా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా తదితర అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధిహమీ పథకంలో భాగంగా మండలంలో కూలీలకు పని కల్పిస్తున్నారా, కూలీల పని దినాలు, క్షేత్ర స్థాయిలో ఉపాధిహమీ ద్వారా అధికారులు రైతులకు ఉపయోగపడే పనులు చేయిస్తున్నారా? పశుపొషణ ద్వారా పాడి గేదెలు, బర్రెల పెంపకం, వివిధ శాఖలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏన్‌ఏంలు సక్రమంగా ఉంటున్నారా? అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భినులకు పౌష్టికహరం అందుతుందా లేదా రేషన్ పరఫరా చేస్తున్నారా వంటి వివిధ అంశాలపై నూతన సర్పంచ్‌లు చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో గ్రామాల్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చిస్తేనే పరిష్కారానికి నోచుకునే విలుంటుంది. ఈ నేపధ్యంలో మండలంలో జరిగే సర్వసభ్య సమావేశంలో నూతన సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్న సందర్భంగా సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకోంటారో లేదో చూడాలి. -
పల్లెల్లో కొత్త పాలన
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ‘స్థానిక’ సమరం ముగిసింది. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వం కూడా అపాయింటెడ్ డేను ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు శనివారం కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గతేడాది ఆగస్టులో పంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషలాఫీసర్లు లేని జీపీల్లో కార్యదర్శులు బాధ్యతలు అప్పగిస్తారని సంబంధిత అధికారులు పేర్కొం టున్నారు. అయితే కొత్త పాలకవర్గం కొలువుదీరన రోజే పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 223 పంచాయతీల్లో తొలి సారిగా పాలన ఆరంభం కానుంది. కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు.. జిల్లాలోని 465 గ్రామ పంచాయతీలకు గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఉత్సాహంతో ఉన్నారు. వీరికి పంచాయతీ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఫిబ్రవరి 2గా నిర్ణయించడంతో శనివారం రోజున పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజు సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. కాగా, కాల పరిమితి ముగియని, ఎన్నికలు జరగని పంచాయతీలకు విడిగా ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటిస్తుందని పంచాయతీరాజ్ శాఖ నుంచి వెలువడిన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఆరు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరనున్నందున ఇక నుంచి అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది. రేపటి నుంచి కొత్త పంచాయతీల్లో పాలన జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 224 జీపీల్లో కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే బేల మండలంలోని కొబ్బాయి జీపీకి కాలపరిమితి ముగియనుందున ఎన్నికలు జరగలేదు. ఈ జీపీ నుంచి కొత్తగా మాంగ్రూడ్ పంచాయతీ ఏర్పాటైంది. అంటే ఒక్క మాంగ్రూడ్ జీపీ మినహా మిగతా 223 గ్రామ పంచాయతీలు కొత్తగా పాలనను ప్రారంభించనున్నాయి. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత 2018 ఆగస్టు 2న పంచాయతీ బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. స్పెషలాఫీసర్లతో ప్రారంభమైన కొత్త పంచాయతీలు ఇప్పుడు పాలక వర్గాలతో కళకళలాడనున్నాయి. అయితే పాత జీపీల పరిధిలోని తండాలు, గూడేలను గుర్తించి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. కొన్ని జీపీలకు భవనాలు, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు లేక ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలకు పరిపాలన సవాలుగా మారనుందని చెప్పవచ్చు. కొత్త చట్టంపై సర్పంచులకు శిక్షణ గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఫిబ్రవరిలోనే పరిపాలన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతోపాటు గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ శిక్షణ ఉంటుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు శిక్షణ పొందునున్నారు. అనంతరం జిల్లాలో ఈ నెల 11 నుంచి మూడు విడతలుగా సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్తొతగా ఎన్నికైన 465 మంది సర్పంచులకు ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలి.. అనే దానిపై సమగ్ర ప్రణాళిక తయారీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
రేపే ముహూర్తం
పాపన్నపేట(మెదక్): కొత్త సర్పంచ్‌లు కొలువు దీరేందుకు ఫిబ్రవరి 2వ తేదీ ముహూర్తం ఖరారయ్యింది. గతేడాది ఆగస్టు 2 నుంచి నేటి వరకు 184 రోజుల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. నేటితో ఈ పాలనకు తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్తవారే సర్పంచ్‌లుగా ఎన్నిక కావడంతో పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పిస్తు.. వారి విధులు.. అధికారాలు గురించి వివరించేందుకు 11వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మెదక్ కొత్త జిల్లాగా అవతరించినపుడు మొదట 312 గ్రామంచాయతీలు ఉండేవి.అయితే 500 జనాభా గల గిరిజన తండాలను, మధిర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 157 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే ఎనిమిది గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 4,58,325 ఓటర్లున్నారు. ఇందులో 90 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 2న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈమేరకు అపాయింట్మెంట్ డే గా నిర్ణయిస్తూ పంచాయతీరాజŒ æశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అతే ఆ రోజు జరిగే సమావేశంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేస్తారు. ఆరోజు నుంచి 5 ఏళ్ల పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది. ఫిబ్రవరి 11 నుంచి శిక్షణ కొత్త సర్పంచ్‌లకు విధులు, అ«ధికారాలు, బాధ్యతలు తదితర విషయాలపై అవగాహన కల్పిచేందుకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 1 వరకు జిల్లాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తొలివిడత శిక్షణ 11 నుంచి 15 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత ఫిబ్రవరి 25 నుంచి మార్చి1 వరకు ఉండనుంది. అంతకు ముందు ఫిబ్రవరి 3 నుంచి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇస్తారు. పదవీ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ స్వీకారం చేసేందుకు వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. 2వ తేదీన ఉదయం స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించి చార్జి అప్పగిస్తారు. ఈ మేరకు మినిట్స్‌లో నమోదు చేస్తారు. –హనోక్, డీపీఓ శిక్షణ మంచి కార్యక్రమం నేను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, సర్పంచ్ విధులు, అధికారాలు, గ్రామ సభల ఏర్పాటు, హరితహారం, బాధ్యతలు, ఆదర్శ గ్రామావృద్ధి తదితర విషయాలు, రికార్డుల నిర్వాహణ గురించి ఎక్కువగా తెలియదు. అందు వల్ల సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సంతోషం. –కలాలి నవీన్‌గౌడ్, కొత్త లింగాయపల్లి -
‘పంచాయతీ’ రెండో విడత షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం మొదలైంది. రెండో దశలో 4,135 గ్రామ పంచాయతీలు, 36,602 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి తొలి రోజు 4,850 నామినేషన్లు దాఖలవగా వార్డు సభ్యుల స్థానాలకు 9,198 నామినేషన్లు వచ్చాయి. ఆదివారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సోమవారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జత చేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది. నామినేషన్ల తిరస్కరణ అవకాశాలను తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ... తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా, రెండో విడత ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాక గురువారం (17న) మధ్యాహ్నం 3 గంటల్లోగా అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫారం–7 (అనుబంధం–8)లో అభ్యర్థి తన సంతకంతో లిఖితపూర్వక నోటీసును రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా సమర్పించడం ద్వారా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ నోటీసును అభ్యర్థి వ్యక్తిగతంగా సమర్పించలేకుంటే ప్రపోజర్ లేదా ఎన్నికల ఏజెంట్ ద్వారా లిఖితపూర్వకంగా ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ అధికారికి పంపించవచ్చు. ఉపసంహరణ నోటీసుతోపాటు అభ్యర్థి గుర్తింపు సరైనదేనని ధ్రువీకరించాక అభ్యర్థి నోటీసుకు రిటర్నింగ్ అధికారి రశీదు ఇవ్వాలి. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉపసంహరణ నోటీసును రిటర్నింగ్ అధికారికి సమర్పించాక దాన్ని రద్దు చేసే అవకాశం ఉండదు. అభ్యర్థుల ఉపసంహరణ నోటీసులు అందిన వెంటనే రిటర్నింగ్ అధికారి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై ఫారం–7(అనుబంధం–9)లో నోటీస్ వివరాలు పబ్లిష్ చేయాలి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. తిరస్కరించే నామినేషన్లపై అప్పీలుకు చాన్స్... గ్రామ పంచాయతీ సర్పంచ్/వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన పక్షంలో సంబంధిత రెవెన్యూ డివిజనల్/సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మర్నాడు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. 2006 ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 13వ నిబంధన ప్రకారం అప్పీలు చేసుకునే వీలు కల్పించారు. -
‘పంచాయతీ’ అభ్యర్థీ.. ఇవి తెలుసుకో!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పల్లె పోరు జోరందుకుంది. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలుకావడంతో పోటీదారుల్లో ఉత్సాహం పెరిగింది. బుధవారంతో మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగియనుండగా... సర్పంచ్, వార్డు సభ్యత్వానికి పోటీ చేసేవారిలో ఇంకా సందేహాలు తొలగడం లేదు. గ్రామపంచాయతీలో ఓటున్న వార్డులోనే వార్డు సభ్యుడి పోటీకి అర్హుడా?.. లేక పంచాయతీ పరిధిలో ఏ వార్డు నుంచైనా పోటీ చేయొచ్చా?.. ప్రతిపాదించే ఓటరు (ప్రపోజర్) నిబంధనలేంటి?.. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన నిబంధనలు, ప్రపోజర్ నియమాలు తదితరాలపై ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న వార్డులోనే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఓటరై ఉండాలి. అలాగే సర్పంచ్ అభ్యర్థి ప్రపోజర్ కూడా అదే పంచాయతీలోనే ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థులు కోరుకుంటే ఒకటి నుంచి నాలుగు వరకు నామినేషన్ సెట్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ పత్రం దాఖలు చేసినట్లుగా ధ్రువీకరణ కోసం తగిన రసీదు పొందాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - పోటీకి సిద్ధపడడానికి ముందే అభ్యర్థి పేరు, చిరునామా, ఇతర వివరాలు తాజా ఓటరు లిస్ట్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. - నిర్దేశిత (నమూనా–మూడు) పత్రం ప్రకారం నామినేషన్ ఉందా? లేదా? అభ్యర్థి, ప్రపోజర్ల సంతకాలున్నాయా లేదా చూసుకోవాలి. - అభ్యర్థి సంతకం చేసిన స్వయం ధ్రువీకరణపత్రం మరో ఇద్దరి సంతకాలతో ధ్రువీకరణ అయిందో లేదో సరిచూసుకోవాలి. - నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వ యంగాలేదా ప్రపోజర్ ద్వారానే సమర్పించాలి. - ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్ణీత పద్ధతి ప్రకారం పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. - నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకయ్యే వ్యయాన్ని ఈసీ నిర్దేశించిన నమూనాలో నిర్వహించాలి. - మతం,జాతి, కులం, వర్గం లేదా భాష ఆధారంగా ఓటు వేయాలని, వేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేయొద్దు. (అలా చేస్తే శిక్షార్హులవుతారు) - అభ్యర్థుల వ్యక్తిగత నడవడిక, ప్రవర్తన గురించి, ఒక అభ్యర్థి అభ్యర్థిత్వం లేదా ఉపసంహరణ గురించి తప్పుడు సమాచారం ప్రచురించకూడదు. - పోలింగ్ తేదీల్లో పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు. - సంఘం, కులం లేదా వర్గం నుంచి బహిష్కరిస్తామని అభ్యర్థులను లేదా ఓటర్లను బెదిరించరాదు - అనుకూలంగా ఓటు వేయమని కోరడంలో భాగంగా పేరు, ఎన్నికల గుర్తుతో కూడిన గుర్తింపు చీటీలు పంపిణీ చేయొద్దు.