సాక్షి, హైదరాబాద్: తొలివిడత పల్లె పోరు జోరందుకుంది. సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలుకావడంతో పోటీదారుల్లో ఉత్సాహం పెరిగింది. బుధవారంతో మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగియనుండగా... సర్పంచ్, వార్డు సభ్యత్వానికి పోటీ చేసేవారిలో ఇంకా సందేహాలు తొలగడం లేదు. గ్రామపంచాయతీలో ఓటున్న వార్డులోనే వార్డు సభ్యుడి పోటీకి అర్హుడా?.. లేక పంచాయతీ పరిధిలో ఏ వార్డు నుంచైనా పోటీ చేయొచ్చా?.. ప్రతిపాదించే ఓటరు (ప్రపోజర్) నిబంధనలేంటి?.. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన నిబంధనలు, ప్రపోజర్ నియమాలు తదితరాలపై ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న వార్డులోనే అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి ఓటరై ఉండాలి. అలాగే సర్పంచ్ అభ్యర్థి ప్రపోజర్ కూడా అదే పంచాయతీలోనే ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థులు కోరుకుంటే ఒకటి నుంచి నాలుగు వరకు నామినేషన్ సెట్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ పత్రం దాఖలు చేసినట్లుగా ధ్రువీకరణ కోసం తగిన రసీదు పొందాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- పోటీకి సిద్ధపడడానికి ముందే అభ్యర్థి పేరు, చిరునామా, ఇతర వివరాలు తాజా ఓటరు లిస్ట్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- నిర్దేశిత (నమూనా–మూడు) పత్రం ప్రకారం నామినేషన్ ఉందా? లేదా? అభ్యర్థి, ప్రపోజర్ల సంతకాలున్నాయా లేదా చూసుకోవాలి.
- అభ్యర్థి సంతకం చేసిన స్వయం ధ్రువీకరణపత్రం మరో ఇద్దరి సంతకాలతో ధ్రువీకరణ అయిందో లేదో సరిచూసుకోవాలి.
- నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వ యంగాలేదా ప్రపోజర్ ద్వారానే సమర్పించాలి.
- ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్ణీత పద్ధతి ప్రకారం పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి.
- నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకయ్యే వ్యయాన్ని ఈసీ నిర్దేశించిన నమూనాలో నిర్వహించాలి.
- మతం,జాతి, కులం, వర్గం లేదా భాష ఆధారంగా ఓటు వేయాలని, వేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేయొద్దు. (అలా చేస్తే శిక్షార్హులవుతారు)
- అభ్యర్థుల వ్యక్తిగత నడవడిక, ప్రవర్తన గురించి, ఒక అభ్యర్థి అభ్యర్థిత్వం లేదా ఉపసంహరణ గురించి తప్పుడు సమాచారం ప్రచురించకూడదు.
- పోలింగ్ తేదీల్లో పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు.
- సంఘం, కులం లేదా వర్గం నుంచి బహిష్కరిస్తామని అభ్యర్థులను లేదా ఓటర్లను బెదిరించరాదు
- అనుకూలంగా ఓటు వేయమని కోరడంలో భాగంగా పేరు, ఎన్నికల గుర్తుతో కూడిన గుర్తింపు చీటీలు పంపిణీ చేయొద్దు.
‘పంచాయతీ’ అభ్యర్థీ.. ఇవి తెలుసుకో!
Published Tue, Jan 8 2019 2:03 AM | Last Updated on Tue, Jan 8 2019 2:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment