ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ‘స్థానిక’ సమరం ముగిసింది. గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టి పాలన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వం కూడా అపాయింటెడ్ డేను ప్రకటించింది. నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు శనివారం కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గతేడాది ఆగస్టులో పంచాయతీలకు నియమించబడిన ప్రత్యేక అధికారులు కొత్త సర్పంచులకు బాధ్యతలు అప్పగించనున్నారు. స్పెషలాఫీసర్లు లేని జీపీల్లో కార్యదర్శులు బాధ్యతలు అప్పగిస్తారని సంబంధిత అధికారులు పేర్కొం టున్నారు. అయితే కొత్త పాలకవర్గం కొలువుదీరన రోజే పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 223 పంచాయతీల్లో తొలి సారిగా పాలన ఆరంభం కానుంది.
కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు..
జిల్లాలోని 465 గ్రామ పంచాయతీలకు గత నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఉత్సాహంతో ఉన్నారు. వీరికి పంచాయతీ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం అపాయింటెడ్ డేను ఫిబ్రవరి 2గా నిర్ణయించడంతో శనివారం రోజున పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజు సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి నుంచి పదవీ కాలం ఐదేళ్ల పాటు కొనసాగనుంది. కాగా, కాల పరిమితి ముగియని, ఎన్నికలు జరగని పంచాయతీలకు విడిగా ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటిస్తుందని పంచాయతీరాజ్ శాఖ నుంచి వెలువడిన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఆరు నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరనున్నందున ఇక నుంచి అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంది.
రేపటి నుంచి కొత్త పంచాయతీల్లో పాలన
జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 224 జీపీల్లో కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే బేల మండలంలోని కొబ్బాయి జీపీకి కాలపరిమితి ముగియనుందున ఎన్నికలు జరగలేదు. ఈ జీపీ నుంచి కొత్తగా మాంగ్రూడ్ పంచాయతీ ఏర్పాటైంది. అంటే ఒక్క మాంగ్రూడ్ జీపీ మినహా మిగతా 223 గ్రామ పంచాయతీలు కొత్తగా పాలనను ప్రారంభించనున్నాయి. గత సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత 2018 ఆగస్టు 2న పంచాయతీ బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే. స్పెషలాఫీసర్లతో ప్రారంభమైన కొత్త పంచాయతీలు ఇప్పుడు పాలక వర్గాలతో కళకళలాడనున్నాయి. అయితే పాత జీపీల పరిధిలోని తండాలు, గూడేలను గుర్తించి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. కొన్ని జీపీలకు భవనాలు, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్లు లేక ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో కొత్త పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలకు పరిపాలన సవాలుగా మారనుందని చెప్పవచ్చు.
కొత్త చట్టంపై సర్పంచులకు శిక్షణ
గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఫిబ్రవరిలోనే పరిపాలన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతోపాటు గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ శిక్షణ ఉంటుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులు శిక్షణ పొందునున్నారు. అనంతరం జిల్లాలో ఈ నెల 11 నుంచి మూడు విడతలుగా సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్తొతగా ఎన్నికైన 465 మంది సర్పంచులకు ఎక్కడెక్కడ శిక్షణ ఇవ్వాలి.. అనే దానిపై సమగ్ర ప్రణాళిక తయారీ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పల్లెల్లో కొత్త పాలన
Published Fri, Feb 1 2019 12:02 PM | Last Updated on Fri, Feb 1 2019 12:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment