మునుగనూర్‌లో కొత్తగా నిర్మితమవుతున్న కాలనీ
చుట్టూ పచ్చటి పంట పొలాలు.. ఒకే గొడుగు కింద ఉన్నట్లుగా కనిపించే పదుల సంఖ్యలో పెంకుటిళ్లు, రేకుల గదులు.. ఇళ్ల మధ్యలో చిన్న చిన్న సందులు.. ఇరుకు రోడ్లు.. ఇదంతా పదేళ్ల క్రితం నాటి ఆ గ్రామాల పరిస్థితి. ఇప్పుడు ఆ గ్రామాలు బహుళ అంతస్తుల భవనాలు, ఖరీదైన బంగ్లాలు, విశాలమైన రోడ్లతో నగరాలను తలపిస్తున్నాయి. పట్టణ ప్రాంత ప్రజలు శివార్ల బాటపట్టడంతో పంట పొలాలు మాయమై కనుచూపు మేర కాలనీలు విస్తరించాయి. వందల సంఖ్యలో ఆధునిక హంగులతో గృహాలు వెలిశాయి. పట్టణీకరణ నేపథ్యంలో గ్రామీణ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
– శంషాబాద్ రూరల్/హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట:
శంషాబాద్ రూరల్/హయత్‌నగర్/ పెద్దఅంబర్‌పేట : హైదరాబాద్ నగర శివారు మండలాలు శంషాబాద్, మొయినాబాద్, మహేశ్వరం, కందుకూరు, హయత్‌నగర్, చేవెళ్ల, కొత్తూరు ప్రాంతాల్లోని గ్రామాల్లో పల్లె శోభ కనుమరుగవుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగురోడ్డును ఆనుకుని ఉన్న మండలాల్లో శరవేగంగా అభివృద్ధి కనిపిస్తోంది. దీనికి తోడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్లలో టాటా ఎయిరోస్పేస్ సంస్థలను నెలకొల్పడంతో పాటు ఫార్మాసిటీ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయి. భూముల ధరలు పెరగడం.. ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో గ్రామీణుల జీవన శైలిలో మార్పు సంతరించుకుంటోంది. పెద్ద పెద్ద ఇళ్లు, ఖరీదైన బంగ్లాలు వెలుస్తున్నాయి. గత ఐదేళ్లలో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. శంషాబాద్ మండలం ఊట్‌పల్లిలో డూప్లెక్స్ భవనాలు, అపార్ట్‌మెంట్ తరహా నిర్మాణాలు ఊపందుకున్నాయి.
వలస జీవుల రాకతో...
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్, కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుండడంతో జనం శివారు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. దీనికి తోడు ఉపాధి, ఉద్యోగం, పిల్లల చదువుల కోసం చాలా మంది మారుమూల గ్రామాల నుంచి శివారు మండలాలకు వలస వస్తున్నారు. దీంతో నగరానికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో కొత్తగా లేఅవుట్‌లు వెలసి నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. గ్రామాలు కాస్త పట్టణాలుగా మారిపోతున్నాయి. ఆయా మండల కేంద్రాలతో పాటు ఊట్‌పల్లి, తొండుపల్లి, నర్కూడ, చౌదరిగూడ, మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో కొత్తగా కాలనీలు వెలస్తున్నాయి. ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయంతో పచ్చగా కనిపించే భూముల్లో నేడు ఎక్కడ చూసినా ఇళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి.
జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
శివారు మండలాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో సైతం ఎకరం ధర రూ.30లక్షల పైమాటే. ఇక లేఅవుట్‌లకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.కోట్లు పలుకుతోంది. కొత్తగా వెలుస్తోన్న కాలనీల్లో చాలా మంది ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉంటున్నారు. స్థానికంగా భూములు అమ్ముకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో లాభాలు ఆర్జించిన వారు ఖరీదైన జీవనశైలికి అలవాటుపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఇళ్లు, కార్లు సమకూర్చుకుంటున్నారు. శంషాబాద్ మండలంలోని ఊట్‌పల్లి, నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో వెలుస్తున్న కాలనీల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాల వారే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
శంషాబాద్ మండలంలోని ఊట్‌పల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 960 ఎకరాల భూములుండగా.. ఇందులో 686 ఎకరాల్లో లేఅవుట్‌లు వెలిశాయి. ఐదేళ్ల కాలంలో దాదాపు 200 ఎకరాల్లో కొత్తగా వెంచర్లు వెలిశాయి.- శంషాబాద్ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో కొత్త కాలనీల సంఖ్య పెరిగిపోతోంది. వీటి పరి«ధిలో 3,858 ఎకరాల భూములుండగా.. 1500 ఎకరాల్లో లేఅవుట్‌లు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ 350 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు.
పల్లె రూపు కోల్పోయిన మునుగనూర్
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మునగనూరు గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 300 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం 1992 వరకు ఇంజాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ అనుబంధ గ్రామం. రోడ్డుకు దూరంగా ఉండడంతో ఉనికి కూడా కనిపించేది కాదు. బ్యాంక్ కాలనీ ఏర్పడిన తర్వాత 700పైగా ఓటర్లు కావడంతో అప్పడు గ్రామ పంచాయతీగా అవతరించింది. 2000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండేది. హయత్‌నగర్ పట్టణానికి అనుకుని ఉన్న ఈ గ్రామంలో 1982 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. క్రమంగా గ్రామంలోని వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారాయి. పది సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. పొలాలను అమ్ముకున్నవారు రియల్ వ్యాపారంలోకి దిగారు. దీనికి తోడుగా బిల్డర్‌లు రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సుమారు 15 కాలనీలలో 1500 వరకు ఇళ్ల నిర్మాణం జరిగింది. వందల సంఖ్యలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. పట్టణ ప్రాంతం నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ ఇళ్లను కొగోలు చేస్తుడండంతో మునుగనూర్ హాట్ కేక్‌గా మారింది.
మౌలిక వసతులు కల్పించాలి
శంషాబాద్ మండల శివారు గ్రామాల్లో కొత్తగా కాలనీలు వేగంగా పుట్టకొస్తున్నాయి. చాలా వరకు ఇతర ప్రాంతాల వారు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్థానికేతరులే ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్నారు. జనావాసాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– జి.కృష్ణకుమార్, ఉప సర్పంచ్, ఊట్‌పల్లి
అభివృద్ధితో ఉపాధి దొరుకుతోంది..
మునుగనూరు వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు వ్యవసాయం మీదనే అధారపడి బతికేవారు ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో అనేక మందికి పనిదొరుకుతుంది. ప్రశాంత వాతావరణం ఉండడంతో స్థానికేతరులు ఇక్కడ నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తుడండంతో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.
–దోమలపల్లి దర్శన్, మునగనూరు గ్రామస్తుడు
Comments
Please login to add a commentAdd a comment