నెలవారీ తలసరి వినియోగ వ్యయం అంతరంలో భారీగా తగ్గుదల
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది.
వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్‌బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.
దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి 71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి
దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్టణాలు, గ్రామాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 39.3 శాతమేనని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4,870 ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెలవారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది.
2011–12తో పోల్చి చూస్తే 2022–23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీలో అసమానతలు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment