సివిల్స్‌లో విశ్వశ్రీ
కమ్మర్‌పల్లి : చౌట్‌పల్లి గ్రామానికి చెందిన బోగ అరుణ నిత్యానంద్ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ మళ్లీ సివిల్స్‌కు ఎంపికయ్యారు. గురువారం వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో విశ్వశ్రీ ఈ ఘనత సాధించారు. ఆమె ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్(ఐఆర్‌టీఎస్) శిక్షణలో ఉండగానే సివిల్స్ రాసి 346వ ర్యాంక్ సాధించడం విశేషం. గతేడాది తొలి ప్రయత్నంలోనే 787వ ర్యాంకు సాధించిన విశ్వశ్రీ ఐఆర్‌టీఎస్‌కు ఎంపికై శిక్షణ పొందుతూ, సివిల్స్ రాసి 346 ర్యాంకు సాధించారు.
చదువు నేపథ్యం..
విశ్వశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని నిర్మల హృదయ పాఠశాలలో చదివారు. గుంటూరులోని వికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదారాబాద్‌లోని ఎంజేసీటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో ఎంబీఏ చదివారు. కొద్ది రోజుల పాటు సెర్ఫ్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఆమె.. భర్త నక్క భానుశ్యాం ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడికి వెళ్లారు. ఢిల్లీలోనే ఉంటూ భర్త, అత్తమ్మ కోటాలమ్మ ప్రోత్సాహంతో సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు.
పోయినేడాది మొదటి ప్రయత్నంలోనే 787వ ర్యాంకు సాధించి, ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పొందుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయి 346వ ర్యాంకు సాధించారు. విశ్వశ్రీ భర్త ప్రస్తుతం ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 346వ ర్యాంకు సాధించిన విశ్వశ్రీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లోని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగం లభించే అవకాశముంది.