‘కరువు’పై వేగంగా కదలాలి
♦ గోదావరి పుష్కరాల ఏర్పాట్ల తరహాలో స్పందించాలి
♦ ప్రభుత్వానికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచన
♦ కరువుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది
♦ కరువు చర్యలపై ప్రభుత్వ స్పందన నిరాశ కలిగిస్తోంది
♦ 4 జిల్లాల్లో పరిస్థితులపై సీఎస్‌కు అధ్యయన నివేదిక సమర్పణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చేతివృత్తులు ఛిద్రమయ్యాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కరువు చర్యలపై ప్రభుత్వ స్పందన నిరాశ కలిగిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం నీటి సరఫరా తప్ప మిగతా విషయాల్లో ప్రభుత్వాధికారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏ వేగంతో స్పందించిందో కరువు నివారణ కోసం సైతం అంతే వేగంగా కదలాలని...అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని సూచించారు.
ప్రభుత్వం సరిగ్గా దృష్టిపెడితేనే చేతివృత్తులు మళ్లీ బతికి బట్టకట్టగలుగుతాయన్నారు. రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి రూపొందించిన కరువు నివేదికను బుధవారం ఆయన జేఏసీ ప్రతినిధి బృందంతో కలసి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమర్పించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ కరువు చర్యలపై ప్రభుత్వానికి ఆచరణాత్మక సూచనలు చేశామని... దీనిపై సీఎస్ సానుకూలంగా స్పందించారన్నారు.
పత్తికి ప్రత్యామ్నాయం సరే..రక్షణేదీ?
పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై రైతులు సానుకూలంగానే ఉన్నా పందులు, పక్షుల తాకిడి నుంచి రక్షణ కోరుకుంటున్నారని కోదండరాం పేర్కొన్నారు. బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల ధరలను ముందే నిర్ణయించాలన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇతర ప్రజాసంఘాలతో సమావేశమై కరువు నివేదికపై చర్చించి డిమాండ్లు, కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో తాము ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదన్నారు. టీజేఏసీని వీడి బయటకు వెళ్లిన వ్యక్తుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉందన్నారు. కార్యక్రమంలో జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు, సమన్వయకర్త పిట్టల రవీందర్, పైడి రమేశ్, ప్రహ్లాద్, ఖాజా మొయినోద్దీన్, డీపీ రెడ్డి, వెంకట్‌రెడ్డి, పురుషోత్తం, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి టీజేఏసీ చేసిన సూచనలు...
♦ అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.
♦ గుర్తింపు ప్రమాణాలను ఆధునీకరించాలి. అన్ని గ్రామాల్లో వర్ష మాపకాలు ఏర్పాటు చేయాలి. భూగర్భ జల మట్టాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
♦ పంట నష్ట పరిహారాన్ని ఎకరాకు రూ. 10 లక్షలకు పెంచాలి. ఒకే విడతలో పంట రుణాలను మాఫీ చేయాలి.
♦ కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాతోపాటు పశుగ్రాసాన్ని అందుబాటుటోకి తేవాలి.
♦ కరువుతో చితికిపోయిన చేతివృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
♦ నిలిచిపోయిన ఉపాధి హామీ పనులను తిరిగి ప్రారంభించాలి. కూలీలకు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి.
♦ ఆసరా లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నిరాశ్రయులకూ మధ్యా హ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలి.
♦ చెరువులను కృష్ణా, గోదావరి నదులతో అనుసంధానించాలి.