T-JAC chairman
-
‘కరువు’పై వేగంగా కదలాలి
♦ గోదావరి పుష్కరాల ఏర్పాట్ల తరహాలో స్పందించాలి ♦ ప్రభుత్వానికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచన ♦ కరువుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది ♦ కరువు చర్యలపై ప్రభుత్వ స్పందన నిరాశ కలిగిస్తోంది ♦ 4 జిల్లాల్లో పరిస్థితులపై సీఎస్‌కు అధ్యయన నివేదిక సమర్పణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చేతివృత్తులు ఛిద్రమయ్యాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కరువు చర్యలపై ప్రభుత్వ స్పందన నిరాశ కలిగిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం నీటి సరఫరా తప్ప మిగతా విషయాల్లో ప్రభుత్వాధికారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏ వేగంతో స్పందించిందో కరువు నివారణ కోసం సైతం అంతే వేగంగా కదలాలని...అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని సూచించారు. ప్రభుత్వం సరిగ్గా దృష్టిపెడితేనే చేతివృత్తులు మళ్లీ బతికి బట్టకట్టగలుగుతాయన్నారు. రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి రూపొందించిన కరువు నివేదికను బుధవారం ఆయన జేఏసీ ప్రతినిధి బృందంతో కలసి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమర్పించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ కరువు చర్యలపై ప్రభుత్వానికి ఆచరణాత్మక సూచనలు చేశామని... దీనిపై సీఎస్ సానుకూలంగా స్పందించారన్నారు. పత్తికి ప్రత్యామ్నాయం సరే..రక్షణేదీ? పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై రైతులు సానుకూలంగానే ఉన్నా పందులు, పక్షుల తాకిడి నుంచి రక్షణ కోరుకుంటున్నారని కోదండరాం పేర్కొన్నారు. బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల ధరలను ముందే నిర్ణయించాలన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇతర ప్రజాసంఘాలతో సమావేశమై కరువు నివేదికపై చర్చించి డిమాండ్లు, కార్యాచరణను రూపొందిస్తామన్నారు. పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో తాము ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదన్నారు. టీజేఏసీని వీడి బయటకు వెళ్లిన వ్యక్తుల నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, భవిష్యత్తును నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉందన్నారు. కార్యక్రమంలో జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు, సమన్వయకర్త పిట్టల రవీందర్, పైడి రమేశ్, ప్రహ్లాద్, ఖాజా మొయినోద్దీన్, డీపీ రెడ్డి, వెంకట్‌రెడ్డి, పురుషోత్తం, లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి టీజేఏసీ చేసిన సూచనలు... ♦ అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి. ♦ గుర్తింపు ప్రమాణాలను ఆధునీకరించాలి. అన్ని గ్రామాల్లో వర్ష మాపకాలు ఏర్పాటు చేయాలి. భూగర్భ జల మట్టాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ♦ పంట నష్ట పరిహారాన్ని ఎకరాకు రూ. 10 లక్షలకు పెంచాలి. ఒకే విడతలో పంట రుణాలను మాఫీ చేయాలి. ♦ కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాతోపాటు పశుగ్రాసాన్ని అందుబాటుటోకి తేవాలి. ♦ కరువుతో చితికిపోయిన చేతివృత్తిదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలి. ♦ నిలిచిపోయిన ఉపాధి హామీ పనులను తిరిగి ప్రారంభించాలి. కూలీలకు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ♦ ఆసరా లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నిరాశ్రయులకూ మధ్యా హ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలి. ♦ చెరువులను కృష్ణా, గోదావరి నదులతో అనుసంధానించాలి. -
టీడీపీ పాలనలో వనరుల విధ్వంసం
ఉద్యోగులకు ఆప్షన్లు వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం జమ్మికుంట, తెలుగుదేశం పాలనలో తెలంగా ణలోని సహజ వనరులను కొల్లగొట్టి సీమాంధ్రకు కట్టబెట్టారని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలతో పాటు తెలంగాణ ఉద్యోగాలను సైతం దోచుకున్నారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం ప్రారంభమైన డీటీఎఫ్ జిల్లా మహాసభల్లో ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం-ప్రజల ఆకాంక్షలు’ అనే అంశం పై ఆయన మాట్లాడారు. రాష్ట్రవిభజన తర్వాత ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం వాంఛనీయం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులు చొరబడి ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం విషయం లో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టే ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేయాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షను గుర్తించకపోతే మరోసారి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. విరసం నేత వరవరరావు ‘ఉపాధ్యాయుడు-సామాజిక బాధ్యత’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో ప్రజాస్వామిక పోరాటాన్ని పూర్తిచేసే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మూడు లక్షల మంది ఆదివాసులు ఆవాసం కోల్పోతుంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వారి తరఫున మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆది నుంచి పాలకవర్గాలు విప్లవకారులను అణచివేస్తున్నాయని చెప్పారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలకవర్గాలు విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ నైతికంగా విలువలను పాతరేస్తున్నాయని విమర్శించారు. -
చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం
సీమాంధ్రుల కుట్రలో కేంద్రం భాగస్వామి అయినట్టే అసెంబ్లీ ముట్టడితో విధ్వంసం: టీజేఏసీ చైర్మన్ కోదండరాం తాండూరు/వికారాబాద్ న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అలా కాకుండా సీమాంధ్రనాయకుల లాబీయింగ్, కుట్రలకు లొంగి కేంద్రం మరో పదిరోజుల గడువు పొడిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ చర్చకు గడువు ఇచ్చి సరైన సమయానికి బిల్లును పంపకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా కుట్రలో భాగస్వామి అయినట్టేనని చెప్పారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్‌లలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21వ తేదీన సీమాంధ్రులు పెద్ద ఎత్తుగడతోనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారని తెలిపారు. దీనివల్ల ైెహ దరాబాద్‌లో అల్లర్లు సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అనుమతి ఇవ్వరాదని కోరారు. అంతకుముందు కోదండరాం తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లు సరిపోతుందని, పదేళ్లు అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్రుల ఆస్తులపై గానీ, వారిైపైగానీ ఉద్యమకారులు దాడులు చేయలేదని, అలాంటప్పుడు శాంతిభద్రతల విషయం గవర్నరుకు అప్పగించడం ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డు కాదని, ఇస్తే ఇవ్వండని చెప్పిన కొన్ని పార్టీలు నేడు వాటి మనుగడ కోసమే కొత్త నాటకాలాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయాక కూడా సీమాంధ్రులు ఇంకా దానిని ఆపుతామనడం పిల్లచేష్టలని పేర్కొన్నారు. బిల్లు ప్రతులను భోగిమంటల్లో తగులబెట్టడం సరైనపద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగే పరిస్థితి వస్తుందన్నారు. దూరదృష్టి క లిగిన నాయకులు ఇలాంటి పనులు చేయకూడదన్నారు. తెలంగాణకు, సీమాంధ్రకు హైకోర్టులు వేర్వేరుగా ఉండాలన్నారు. పింఛన్లపంపిణీ,కార్పొరేషన్ల ఏర్పాటు, ఉమ్మడి పరీక్షలు, తదితర విషయాలపై అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీకి తామిచ్చిన సమగ్రమైన నివేదిక తెలంగాణ బిల్లు రూపకల్పనలో ఎంతో సహకరించిందని, అక్కడ తమదే బెస్టు రిపోర్టు అని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతుందని హామీ ఇచ్చారు.