టీడీపీ పాలనలో వనరుల విధ్వంసం
ఉద్యోగులకు ఆప్షన్లు వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం
జమ్మికుంట, తెలుగుదేశం పాలనలో తెలంగా ణలోని సహజ వనరులను కొల్లగొట్టి సీమాంధ్రకు కట్టబెట్టారని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలతో పాటు తెలంగాణ ఉద్యోగాలను సైతం దోచుకున్నారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం ప్రారంభమైన డీటీఎఫ్ జిల్లా మహాసభల్లో ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం-ప్రజల ఆకాంక్షలు’ అనే అంశం పై ఆయన మాట్లాడారు. రాష్ట్రవిభజన తర్వాత ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం వాంఛనీయం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులు చొరబడి ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం విషయం లో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టే ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేయాలన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో ప్రజల ఆకాంక్షను గుర్తించకపోతే మరోసారి ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. విరసం నేత వరవరరావు ‘ఉపాధ్యాయుడు-సామాజిక బాధ్యత’ అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో ప్రజాస్వామిక పోరాటాన్ని పూర్తిచేసే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో మూడు లక్షల మంది ఆదివాసులు ఆవాసం కోల్పోతుంటే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వారి తరఫున మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆది నుంచి పాలకవర్గాలు విప్లవకారులను అణచివేస్తున్నాయని చెప్పారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాలకవర్గాలు విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ నైతికంగా విలువలను పాతరేస్తున్నాయని విమర్శించారు.