టీడీపీ చెల్లని పైసా: టీఆర్‌ఎస్
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ చెల్లని పైసాగా మారిందని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్, అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో ఈశ్వర్ మాట్లాడుతూ మద్యం విధానం, శాసనసభ సమావేశాల తీరుపై టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ చేసిన ఆరోపణలు దారుణమన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు హూందాగా వ్యవహరించారన్నారు. టీడీపీ సభ్యులకు పోలవరం ఆర్డినెన్సుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ చవకబారు విమర్శలకు దిగడం మంచిది కాదన్నారు.
అబద్దాలు మాట్లాడితే కోర్టుకీడుస్తాం: రాజయ్య యాదవ్
టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను అప్రతిష్ట పాల్జేయడానికి అబద్దాలు మాట్లాడితే తెలంగాణ టీడీపీ నేతలను కోర్టుకు ఈడుస్తామని అధికార ప్రతినిధి కె.రాజయ్య యాదవ్ హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ మద్యం విధానం, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయినా టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. అందుకే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు బుద్డి చెప్పారని గుర్తుచేశారు.