కేసీఆర్‌లాంటి రాక్షసులు ఉండొద్దు
కాంగ్రెస్ అవినీతి ఖండాంతరాలు దాటింది : చంద్రబాబు
మహబూబ్‌నగర్: ‘తెలంగాణలో కేసీఆర్‌లాంటి రాక్షసులు ఉండకూడదు. ఆయన అవినీతిలో కూరుకు పోయారు. అధికారంలోకి వస్తే దుర్మార్గ పాలన వస్తుంది’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐజ, అచ్చంపేట, జడ్చర్లలో టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఓ మాయల ఫకీరు.. వలసపక్షి.. టీఆర్ ఎస్ వసూళ్ల పార్టీ అని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీతో సహా అందరినీ విమర్శిస్తే అభివృద్ధికి నిధులు ఎక్కడ నుంచి తెస్తాడు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇంటికి పోయే ముందు గొప్పలు చెప్పుకుంటోంది. ఆ నేతల అవినీతి ఖండాంతరాలు దాటిందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేవీపీ విషయంలో గవర్నర్ చొరవ చూపి వెంటనే అరెస్టుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ఆయనపైనా అనుమానాలు వ్యక్తమవుతాయన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ, కేసీఆర్ టీడీపీ మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారని బాబు దుయ్యబట్టారు. కేసీఆర్‌ను గెలిపిస్తే గేటు వరకు వెళ్లవచ్చని, ఆర్.కృష్ణయ్యను గెలిపిస్తే బెడ్‌రూం వరకు వెళ్లవచ్చన్నారు. మాదిగ దండోరాకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్దన్నపేటలో పోటీ చేస్తున్న మంద కృష్ణ మాదిగకు మద్దతు పలుకుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్‌ను గజదొంగల పార్టీగా పేర్కొన్న ఆర్.కృష్ణయ్య 66 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరిక నిర్మూలన జరగలేదన్నారు. టీఆర్‌ఎస్ అబద్దపు పార్టీ అనీ, కేసీఆర్‌ను చిత్తశుద్ది లేని నాయకుడని ఆయన అభివర్ణించారు.