- కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయండి
- తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు
చీపురుపల్లి/సాలూరు/కురుపాం, న్యూస్‌లైన్: తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి తప్ప మిగతా ప్రజలు చాలా మంచి వారని, అం దుకే తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలని, దుర్మార్గులు రాష్ర్ట విభజన చేశారు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చీపురుపల్లి, సాలూరు, కురుపాం బహిరంగ సభల్లో ప్రసింగించారు. తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే పనికిమాలిన వాడని, ప్రజలంతా మంచివారేనని, వారికి న్యాయం చేయాలన్నారు. తెలుగుజాతిపై సోనియాగాంధీ కక్ష కట్టారని, కొడుకును ప్రధాని చేసేందుకే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఆమెను దేశం నుంచి తరిమి కొట్టాలన్నారు. రాహుల్‌గాంధీ జీవితంలో ఎప్పుడూ ప్రధాని కాలేడని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ సోనియాగాంధీకి పెంపుడు కుక్కలా తయారయ్యారని తీవ్రంగా విమర్శించారు.
బొత్స కుటుంబం మద్యం, ఇసుక వ్యాపారాలతో జిల్లాను దోచుకుందని ఆరోపించారు. బొత్స పని అయిపోయిందని, కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి తనకు గొప్పకాదన్నారు. ఢిల్లీ వెళితే మోడీ పక్కన పెద్ద పదవి తనకు వస్తుందన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కు సిగ్గులేకపోవడంతోనే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాడని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మద్యం బెల్టు దుకాణాలు రద్దు చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెబుతూనే నిరుద్యోగ భృతి రూ.రెండువేల రూపాయలు ఇస్తానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌పై కూడా విమర్శలు గుప్పించారు. తన ఓటు చెల్లదని చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో రూ.కోట్లు పంపిణీ జరుగుతున్నా పట్టించుకోని భన్వర్‌లాల్ తన గురించి మాట్లాడడం తగదన్నారు.