హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపుల అంశంపై మరోసారి నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతుండగా, ఆ భూములకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సోమవారం తిరిగి ఆరంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కల్యాణ లక్ష్మి, ప్రభుత్వ శాఖల ఖాళీలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ సభ్యులు అందరూ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా భారతీయ జనతాపార్టీతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని తెలంగాణ టీడీపీ భావిస్తోంది. కీలకమైన ప్రజా సమస్యలపై నిలదీయాలని టీటీడీపీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం గమనార్హం.